వచ్చే10 రోజుల్లో 2,600 శ్రామిక్‌ రైళ్లు

Indian Railways to operate 2,600 Shramik Special trains in next 10 days - Sakshi

36 లక్షల మంది వలస కార్మికుల తరలింపు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటి ద్వారా 36 లక్షల మంది వలస కార్మికులకు లాభం కలుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ వెల్లడించారు. ‘రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి బయలుదేరే శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఇప్పటికే ఉన్న వెయ్యి టికెట్‌ కౌంటర్లకు అదనంగా మరికొన్నిటిని ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.   

80 శాతం ఆ రెండు రాష్ట్రాలకే..
శ్రామిక్‌ రైళ్లలో 80 శాతం ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకే వెళ్తున్నందున ఆ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, దీనిని నివారించేందుకే కొన్ని రైళ్లను దూరమైనా సరే రద్దీలేని మార్గాలకు దారి మళ్లిస్తున్నామని యాదవ్‌ వెల్లడించారు. కోవిడ్‌ రోగుల కోసం రూపొందించిన 5,213 కోచ్‌లలో సగం వరకు ఈ రైళ్లలో వాడుతున్నామన్నారు. ప్రస్తుతానికి ఈ కోచ్‌లు ఖాళీగా ఉన్నాయనీ, కోవిడ్‌ బాధితుల కోసం రాష్ట్రాలు కోరితే అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘రైల్వే శాఖకు చెందిన 17 ఆస్పత్రులను కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చాం.

ఏప్రిల్‌ 1– మే 22వ తేదీల మధ్య 9.7 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను రైళ్ల ద్వారా తరలించాం. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 3,255 పార్శిల్‌ ప్రత్యేక రైళ్లను నడిపాం’ అని వీకే యాదవ్‌ పేర్కొన్నారు. ‘జూన్‌ 1వ తేదీ నుంచి నడిచే 200 స్పెషల్‌ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్‌ ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నాం ఈ రైళ్లలో 30 శాతం టికెట్లే రిజర్వు అయ్యాయి. ప్రయాణించదలచిన వారికి 190 రైళ్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయి’అని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల్లో ఉన్న 4 కోట్ల మంది వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 75 లక్షల మందిని సొంతూళ్లకు తరలించినట్లు హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. శ్రామిక్‌ రైళ్లలో 35 లక్షల మందిని సొంతూళ్లకు తరలించగా, మరో 40 లక్షల మంది బస్సుల్లో తమ గమ్య స్థానాలకు చేరుకున్నారని ఆమె అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top