ఇండియన్స్‌కు బదులుగా కెనడా, మెక్సికన్లు | Indian IT Firms In US Are Hiring From Mexico On TN Visas | Sakshi
Sakshi News home page

Nov 24 2018 7:20 PM | Updated on Nov 24 2018 7:25 PM

Indian IT Firms In US Are Hiring From Mexico On TN Visas - Sakshi

విదేశీయులకు వీసాలనిచ్చే నిబంధనలను ట్రంప్‌ కఠినతరం చేయడం భారతీయ ఐటీ కంపెనీలకు కాక పుట్టిస్తోంది.

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విదేశీయులకు వీసాలనిచ్చే నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ ఐటీ కంపెనీలకు కాక పుట్టిస్తోంది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణుల కొరత ఏర్పడడంతో ఆ కంపెనీలన్నీ అమెరికాకు ఇరుగుపొరుగునున్న మెక్సికో, కెనడా నుంచి టీఎన్‌ వీసాలపై నిపుణులను తెప్పించుకుంటున్నారు. హెచ్‌–1బీ వీసాల్లాగా టీఎన్‌ వీసాలకు దరఖాస్తు సమయం ఉండదు, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికింత కోటా అంటూ పరిమితి ఏమీ ఉండదు. పైగా దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, ఖర్ఛు చాలా తక్కువ. ఎప్పటిప్పుడు వీసా గడువును పొడిగించుకోవచ్చు.

గతేడాదితో పోలిస్తే అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు మెక్సికో, కెనడాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ఈ కంపెనీలు గతేడాదికన్నా ఈ ఏడాది సబ్‌ కాంట్రాక్టులపై కూడా ఎక్కువ ఖర్చు పెట్టాయి. స్థానికంగా అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ట్రంప్‌ భారతీయుల వీసాలను టైట్‌ చేస్తే, ఐటీ కంపెనీలు ఆయన లక్ష్యంగాని విరుద్ధంగా అమెరికా ఇరుగు పొరుగు దేశాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని ‘కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసర్చ్‌’ ఓ అధ్యయనంలో తెలిపింది. కొన్ని కంపెనీలు మెక్సికోలో తమ యూనిట్‌ను పెట్టుకుంటూ సమన్వయంతో పనిచేయించుకుంటున్నాయి. ఇప్పటికే మెక్సికో యూనిట్‌లో తమకు 500 మంది ఉద్యోగులు ఉన్నారని, అవసరమైనప్పుడు వారిని అమెరికాకు బదిలీపై రప్పించుకుంటామని ‘హెక్సావేర్‌’ ఓ మోస్తారు ఐటీ సంస్థ సీఈవో శ్రీకృష్ణ తెలిపారు.

గతేడాదితో పోలిస్తే హెక్సావేర్‌తోపాటు విప్రో, టెక్‌ మహేంద్ర, ఇన్‌ఫోసిస్, టీసీఎస్, మైండ్‌ట్రీ సంస్థలన్నీ ఎక్కువగా బయటకు సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చాయి. స్థానికంగా అమెరికన్లను ఎందుకు ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే, ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు అమెరికన్లు బాగానే పనికొస్తారని, బాగా మేథస్సును ఉపయోగించాల్సిన మధ్య స్థాయిలో, ప్రాజెక్టును విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించే ఉన్నత స్థాయి ఉద్యోగులకు వారంతా పనికి రారని దాదాపు అన్ని కంపెనీలు చెబుతున్నాయి. ఎక్కువ డబ్బులిచ్చి కింద స్థాయిలోనే అమెరికన్లను తీసుకుంటే పైస్థాయి ఉద్యోగులు గొడవ పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతానికి మధ్యేమార్గంగా మెక్సికో, కెనడా ఉద్యోగులు ఉపయోగపడుతున్నారని, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలని కంపెనీల వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement