
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతానికి మూడేళ్ల పాటు వ్యూహాత్మక కార్యక్రమాన్ని అమలుపరచాలని భారత్, దక్షిణాఫ్రికాలు నిర్ణయించాయి. రక్షణ, వ్యాపారం, తీరప్రాంత భద్రత తదితర భిన్న రంగాల్లో సంబంధాల విస్తరణకు ఈ కొత్త ప్రయోగం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు భారత్ వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు, రామఫోసా స్పందిస్తూ..వ్యూహాత్మక కార్యక్రమాన్ని వెంటనే అమల్లోకి తేవాలని రెండు దేశాల మంత్రులు, అధికారులను ఆదేశించామని తెలిపారు. దక్షిణాఫ్రికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇరు దేశాలు నైపుణ్యాభివృద్ధిలోనూ కలసిపనిచేస్తున్నాయి.