చైనాకు భారత్‌ గట్టి కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

‘ఆ విషయం గురించి కూడా మాట్లాడండి’

Published Sat, Sep 28 2019 2:36 PM

India Counter To China JK Reference With CPEC Through PoK - Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ మిత్ర దేశం చైనా కశ్మీర్‌ గురించి ఐక్యరాజ్యసమితి వేదికగా చేసిన వ్యాఖ్యలకు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత అంశమని.. ఈ విషయంలో అన్ని దేశాలు భారత సార్వభౌమత్వాన్ని, జాతి సమగ్రతను గౌరవించాలని హితవు పలికింది. అదే విధంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న చైనా- పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపీఈసీ) గురించి సమాధానం చెప్పిన తర్వాత కశ్మీర్ విషయం గురించి మాట్లాడితే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై విద్వేషపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా చైనా విదేశాంగ మంత్రి సైతం కశ్మీర్‌ అంశంలో భారత్‌ను దోషిని చేసే విధంగా మాట్లాడారు. ‘ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రూపొందించిన నిబంధనల మేరకు కశ్మీర్‌ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సింది. కశ్మీర్‌ విషయంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు’ అని భారత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో చైనా మంత్రి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ‘జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ భారత భూభాగంలో అంతర్భాగమని చైనాకు తెలుసు. ఇక కశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు కూడా భారత అంతర్గత అంశాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవించాలని ఆశిస్తున్నాం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా- పాకిస్తాన్‌ అక్రమంగా ఎకనమిక్‌ కారిడార్‌ నిర్మించడం కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లే’ అని చైనాకు ఘాటు సమాధానమిచ్చారు. కాగా 50 బిలియన్‌ డాలర్లతో 2015లో మొదలైన సీపీఈసీలో భాగంగా పాకిస్తాన్‌, చైనాల మధ్య విరివిగా రోడ్డు రైల్వే మార్గాలు నిర్మించనున్నారు. ఇక భారత్‌ సొంత విషయమైన ఆర్టికల్‌ 370 రద్దును పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ వేదికపై లేవనెత్తిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కశ్మీర్లో అమానవీయంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారని, దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో శుక్రవారం తొలిసారి పాల్గొన్న ఇమ్రాన్‌.. 15 నిమిషాల పరిమితిని దాటి 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇందులో సగం సమయాన్ని భారత్‌పై విషం కక్కేందుకు ఉపయోగించుకోగా.. మిగతా సమయంలో ఇస్లామోఫోబియా(ఇస్లాం అంటే భయం), మనీ లాండరింగ్‌ తదితర అంశాలను ప్రస్తావించారు. 

Advertisement
Advertisement