
సాక్షి,లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే శాంతి భద్రతలను గాడిలో పెట్టడమే తన ముందున్న లక్ష్యమని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. అయితే యోగి సీఎం అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ పరిస్థితులు మెరుగవలేదు. మహిళలపై అత్యాచారాలు యథాతథంగా కొనసాగాయి. శాంతిభద్రతల అంశం యోగి సర్కార్‌కు తలనొప్పిగా మారిన క్రమంలో తాజాగా రాష్ర్ట గవర్నర్ రామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టాయి. యూపీలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
తాను గతంలోనూ, ఇప్పుడూ శాంతిభద్రతల పరిస్థితిపై మాట్లాడుతూనే ఉన్నానని, రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపడాల్సి ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు. సురక్షితంగా జీవించే హక్కు ప్రతి మహిళకూ ఉందని, వారికి భద్రత కల్పించడం ప్రభుత్వం, పోలీసుల కర్తవ్యమని అన్నారు. యూపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విపక్షాలు విమర్శల దాడి చేస్తున్న క్రమంలో గవర్నర్ వ్యాఖ్యలు యోగి సర్కార్‌కు ఇబ్బందికరంగా పరిణమించవచ్చని భావిస్తున్నారు.