
సాక్షి,బెంగళూరు: డిసెంబర్ 31న బెంగళూరులో బాలీవుడ్ నటి సన్నీలియోన్ ‘సన్నీనైట్స్’కు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం చెప్పాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 31న మాన్యతా టెక్‌పార్కులోని ఓ హోటల్‌లో సన్నీనైట్స్ కార్యక్రమానికి అనుమతి లేదని నగర కమిషనర్ సునీల్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
సునీల్‌కుమార్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ నిర్వాహకులు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నగరంలో ఎన్ని క్లబ్బులు ఉన్నాయి? అందులో డిసెంబర్ 31 రాత్రి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎన్ని దరఖాస్తు చేశాయి? ఇప్పటి వరకూ ఎన్నింటికి అనుమతి ఇచ్చారు? ఎన్నింటికి అనుమతి ఇవ్వలేదు? అందుకు కారణాలు ఏమిటీ అన్న విషయాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని గురువారం తన ఆదేశాల్లో పేర్కొంది.