
చండీగఢ్ : విషం తాగిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి.. ఆలయానికి తీసుకెళ్లారు. దాంతో రెండు రోజుల పాటు తీవ్ర అస్వస్థతో బాధపడిన సదరు వ్యక్తి మరణించాడు. వివరాలు.. గురుగావ్‌కు చెందిన జీవరాజ్ రాథోడ్(28) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం విషం తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఓ ఆలయానికి తీసుకెళ్లారు. భగవంతుడే జీవరాజ్‌ను బతికిస్తాడని భావించి ఇలా చేశారు. అంతేకాక అతని చేత బలవంతంగా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగించారు.
అలా చేస్తే జీవిరాజ్ శరీరంలో ఉన్న విషం బయటకు వచ్చేస్తుందని వారు భావించారు. దాంతో పాటు జీవరాజ్ ఆరోగ్యం మెరుగవ్వాలని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన జీవరాజ్ పరిస్థితి బుధవారం నాటికి చేయ్యి దాటిపోయింది. దాంతో జీవరాజ్ కుటుంభ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ ఈ లోపే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.
వారం రోజుల క్రితం కేరళలో కూడా ఇలాంటే సంఘటనే చోటు చేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడిలో రాబిస్ లక్షణాలు కనిపించాయి. కానీ తల్లిదండ్రులు తమ కుమారుడికి చేతబడి ఎవరో చేతబడి చేశారని భావించారు. దాంతో ఆ బాలున్ని ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. కానీ ఈ లోపే బాలుడి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మరణించాడు.