డిప్యూటీ మేయర్‌పై రేప్ కేసు | Gurgaon deputy mayor booked for rape on marriage promise | Sakshi
Sakshi News home page

డిప్యూటీ మేయర్‌పై రేప్ కేసు

Oct 26 2015 11:05 AM | Updated on Sep 27 2018 2:34 PM

డిప్యూటీ మేయర్‌పై రేప్ కేసు - Sakshi

డిప్యూటీ మేయర్‌పై రేప్ కేసు

గుర్గావ్ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత పర్మిందర్ కటారియా అత్యాచార కేసు నమోదైంది.

ఢిల్లీ: గుర్గావ్ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత పర్మిందర్ కటారియాపై అత్యాచార కేసు నమోదైంది. ఆర్థికంగా, మానసికంగా బలహీనంగా  ఉన్న మహిళను బెదిరించి లోబర్చుకుని, చివరకు మొఖం చాటేసిన  కటారియాపై పోలీసులు క్రిమినల్  కేసులు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఆశ  చూపించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆరోపిస్తూ ఆ మహిళ కటారియాపై ఫిర్యాదు చేయడంతో అతగాడి బండారం బయటపడింది.

పోలీసులు సమాచారం ప్రకారం భర్తనుంచి విడిపోయిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో  అశోక్ విహార్ లో నివసిస్తోంది. మున్సిపల్ ఆఫీసులో పనిమీద వెళ్లిన ఆమెను కటారియా టార్గెట్ చేశాడు. ఉద్యోగం ఆశ చూపి, ఆమెతో ప్రేమ నటించి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరు నెలలపాటు సహజీవనం చేశాడు. కానీ పెళ్లి ఊసు లేకపోవడంతో ఆమె కటారియాను నిలదీసింది. దీంతో అయ్యగారి అసలు రూపం బయటపడింది. ఆగ్రహానికి గురైన కటారియా, ఆయన స్నేహితులు ఆమెను బెదిరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే , పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు.  దీంతో అతని మోసాన్ని పసిగట్టిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి, నమ్మించి, తనపై లైంగిక దాడికి పూనుకున్నాడని ఆరోపించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ మేయర్ కటారియా  పరారీలో ఉన్నాడు. అతని ఫోన్  స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసు ఉన్నతాధికారి  దీపక్ సహరాన్ తెలిపారు. తనకున్న పలుకబడినీ, పరిచయాలను ఉపయోగించి గుర్గావ్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలిని  వశపర్చుకుని, నమ్మించినట్టుగా తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.


ఈ ఉదంతంపై హరియాణా కాంగ్రెస్ స్పందించింది. కటారియా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.  దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. అటు బీజేపీ ప్రతినిధి సూరజ్ పాల్ ఈ ఘటనపై   వ్యాఖ్యానించారు. విచారణలో అన్ని విషయాలు తేలతాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement