‘ఎస్సీ, ఎస్టీ’ తీర్పుపై సమీక్షకు ఓకే

Govt review plea in top court against SC/ST Act - Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గత ఏడాది ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసును వచ్చే వారం త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు 2018 మార్చి 20న కొన్ని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పలు సందర్భాల్లో ఈ చట్టం దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డ అత్యున్నత న్యాయస్థానం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం అరెస్ట్‌ చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ప్రభుత్వ అధికారులు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్‌ అవడం వల్ల వారి విధి నిర్వహణ కుంటుపడుతోందని పేర్కొంది. అంతేకాకుండా, ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై ఎలాంటి నిషేధాలు లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసేందుకు ఉన్నతస్థాయి అధికారి అనుమతి అవసరమని కూడా ఆ తీర్పులో పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఈ తీర్పు సమస్యాత్మకమైందని, సమీక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై మే 1వ తేదీన వాదనలు పూర్తి కాగా తాజా తీర్పు వెలువరించింది.

ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ వచ్చిన చట్టంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం న్యాయవాదుల అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం చేసిన ముస్లిం విమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఇన్‌ మ్యారేజీ) చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పలు పిటిషన్లకు తాజా పిటిషన్‌ను జత చేశారు. ఇదిలా ఉండగా..  బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top