గోవిందా, దావుద్ మంచి స్నేహితులు: గవర్నర్ | Govinda took Dawood help to defeat me in 2004: UP governor Ram Naik | Sakshi
Sakshi News home page

గోవిందా, దావుద్ మంచి స్నేహితులు: గవర్నర్

May 3 2016 10:47 AM | Updated on Sep 3 2017 11:20 PM

గోవిందా, దావుద్ మంచి స్నేహితులు: గవర్నర్

గోవిందా, దావుద్ మంచి స్నేహితులు: గవర్నర్

తన పై విజయం సాధించడానికి నటుడు గోవిందా అండర్ వరల్డ్ సహాయం తీసుకున్నాడని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ పేర్కొన్నారు.

లక్నో: తన పై విజయం సాధించడానికి నటుడు గోవిందా అండర్ వరల్డ్ సహాయం తీసుకున్నాడని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ పేర్కొన్నారు. 1999 నుంచి 2004 వరకు రామ్ నాయక్ కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ముంబై లోక్ సభ నియోజకవర్గం నుంచి రామ్ నాయక్(బీజేపీ)పై పోటీ చేసి గోవిందా(కాంగ్రెస్) 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించడానికి గోవిందా అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, బిల్డర్ హితేన్ థాకూర్ల సహాయం తీసుకున్నాడని తాను రాసిన ఓ పుస్తకంలో వెల్లడించారు. తాను ఇటీవల మరాఠీలో రాసిన స్వీయ చరిత్ర చైర్వేతీ, చైర్వేతీ(ముందుకు సాగూ) ఏప్రిల్ 25న ఆవిష్కరించారు.

మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన తాను ముంబై అభివృద్ధికి ఎంతగానో కృషిచేశానని తెలిపారు. అయినా స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. తన ఓటమికి కారణాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గోవిందాకు దావుద్, థాకూర్ మంచి స్నేహితులు అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొందడానికి వారి సహాయం తీసుకున్నాడని రామ్ నాయక్ ఆరోపించారు.

సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న రామ్ నాయక్ ఇలాంటి ఆరోపణలు చేస్తారని తాను ఊహించలేదని గోవిందా అన్నారు.'నన్పు నమ్మి నాకు విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఎన్నికల్లో విజయానికి నేనెవరి సహాయం తీసుకోలేదు' అని తన పై వచ్చిన ఆరోపణలపై గోవిందా వివరణ ఇచ్చుకున్నారు. అండర్ వరల్డ్కు అమ్ముడుపోయే వారిలా నియోజక వర్గ ప్రజలు కనిపిస్తున్నారా అని రామ్ నాయక్ పై మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలతో ప్రజలను అవమానపరచకండి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement