
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై కొన్ని నెలలుగా విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి గోవిందా తరఫు లాయర్ లలిత్ బింద్రా కూడా స్పందించారు. వారిద్దరి విడాకులకు సంబంధించి ఎలాంటి కేసు లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు కావాలనే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. వినాయకచవితి పండగనాడు వారిద్దరినీ జంటగా చూడొచ్చని లాయర్ లలిత్ చెప్పారు. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.
నటుడు గోవింద మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే సునీతా అహుజా విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించినట్టు పలు కథనాలు వచ్చాయి. 30 ఏళ్ల ఓ మరాఠీ నటితో గోవిందా దగ్గరగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వల్లనే సునీతతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం.