
కోవిడ్-19 ప్రభావంతో నిధుల వ్యయంపై కఠిన నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఖర్చును తగ్గించే పనిలో ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలు ఉండవని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. నూతన పథకాల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి ప్రతిపాదనలూ పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకూ సమాచారం చేరవేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్‌తో పాటు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అమలుకే ఖర్చును పరిమితం చేస్తామని, ఇతర పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోవిడ్-19 వ్యాప్తితో ప్రభుత్వ ఆర్థిక వనరులకు అసాధారణ డిమాండ్ నెలకొన్న క్రమంలో మారుతున్న ప్రాధాన్యాతలకు అనుగుణంగా వాటిని సవ్యంగా వినియోగించుకోవాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన నోట్ పేర్కొంది. బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పథకాలు కూడా మార్చి 31 వరకూ నిలిచిపోతాయని తెలిపింది. ఈ నూతన నిబంధనలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలన్నా దానికి వ్యయ విభాగం అనుమతి అవసరమని ఈ నోట్ వెల్లడించింది. చదవండి : అదనపు రుణ వినియోగంపై ఆంక్షలు లేవు