సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే

Government Allows Movement Of Stranded People With Conditions - Sakshi

షరతులతో కేంద్రం అనుమతి

వలస కార్మికులకు ఊరట

విద్యార్థులు, పర్యాటకులకూ శుభవార్త

సాక్షి, న్యూఢిల్లీ: నిలువ నీడ లేక, ఉపాధి కానరాక పూట పూటకూ సర్కారు ఆహార కేంద్రాల వద్ద భారీ లైన్లలో కంచాలు పట్టుకుని నిలుచున్న వలస కార్మికులకు కేంద్రం ఊరట కల్పించింది. స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పించింది. అలాగే, లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తదితరులకూ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. నిబంధనలకు లోబడి వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించింది. కేంద్ర విపత్తు నిర్వహణ చట్టం పరిధిలో లాక్‌డౌన్‌ ఉత్తర్వులకు అనుబంధంగా బుధ వారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించింది. 

ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్, గుజ రాత్, పంజాబ్, అస్సాం, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ విద్యార్థులు, పర్యాటకులను వెనక్కు తీసుకువెళ్లాయి. కాగా, తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ గుజరాత్‌లోని సూరత్‌లో, ముంబైలోని బాంద్రాలో వలస కార్మికులు ఇటీవల నిరసన ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ.. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి వేలాదిగా కార్మికులు కాలి నడకన తమ సొంతూళ్లకు పయనమైన విషయం తెలిసిందే. చదవండి: వలసజీవులకు ఎట్టకేలకు విముక్తి

ఇవీ మార్గదర్శకాలు:
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నోడల్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలి. చిక్కుకుపోయిన వారిని పంపించేందుకు, స్వస్థలాల్లో స్వాగతించేందుకు ప్రామాణిక నిర్వహణ నియమాలు (స్టాండర్డ్‌ ప్రొటోకాల్‌) రూపొందించాలి. చిక్కుకుపోయిన వారి వివరాలను నోడల్‌ యంత్రాంగం రిజిస్టర్‌ చేయాలి. 
చిక్కుకుపోయిన వారు ఒక సమూహంగా ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం నుంచి మరో రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే.. పంపించే రాష్ట్రం, స్వీకరించే రాష్ట్రం పరస్పర సంప్రదింపుల ద్వారా రోడ్డు మార్గంలో తరలించేందుకు అంగీకారానికి రావాలి.
ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే వారిని పరీక్షించి వైరస్‌ లక్షణాలు లేని వారిని వెళ్లేందుకు అనుమతించాలి.
సమూహాలను తరలించేందుకు బస్సులను వినియోగించాలి. ఆయా బస్సులను పూర్తిగా శానిటైజ్‌ చేయాలి. వారు కూర్చునేటప్పుడు భౌతిక దూరం నిబంధనలను పాటించేలా చూడాలి.
ఇలా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపేటప్పుడు మార్గమధ్యలో ఉన్న రాష్ట్రాలు ఆయా వ్యక్తులను అనుమతించాలి. 
ఆయా వ్యక్తులు గమ్యస్థానాలకు చేరుకోగానే స్థానిక ఆరోగ్య సిబ్బంది పరీక్షించాలి. క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాల్సిన అవసరం లేనిపక్షంలో ఆయా వ్యక్తులను హోం క్వారంటైన్‌లో పెట్టాలి. క్రమానుగత ఆరోగ్య పరీక్షలు జరుపుతూ వారిపై పర్యవేక్షణ ఉంచాలి. ఇందుకోసం ఆయా వ్యక్తులు ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించేలా ప్రోత్సహించాలి. దీని ద్వారా వారి ఆరోగ్య స్థితిని ట్రాక్‌ చేస్తూండాలి. మార్చి 11, 2020న జారీచేసిన హోం క్వారంటైన్‌ మార్గదర్శకాలను పాటించాలి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top