 
													అమెరికాలో వర్క్ పర్మిట్ల అటోమేటిక్ రెన్యూవల్‌కు స్వస్తి
డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన
పని అనుమతి పొడిగించాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలు తప్పనిసరి
హెచ్–4, ఎఫ్–1 వీసాదారులపై తీవ్ర ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల పని అనుమతులను(వర్క్ పర్మిట్లు) అటోమేటిక్‌గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వచి్చంది.
దీంతో విదేశీ ఉద్యోగులు.. ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు, హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నెల 30వ తేదీ లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్లు(ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు–ఈఏడీ) పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై అటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు.
అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్నవారిపై ఎలాంటి ప్రభావం పడదు. వారి వర్క్ పర్మిట్లు(ఈఏడీ) ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతాయి. అమెరికాలో ఈఏడీ పొడిగింపు కోసం ప్రతిఏటా 4.50 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతోపాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తేల్చిచెప్పింది.   
బైడెన్ నిర్ణయానికి మంగళం  
హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు(హెచ్–4 వీసాదారులు), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఉన్న ఎఫ్–1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాలవ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకొనే అవకాశాన్ని జో బైడెన్ ప్రభుత్వ హయాంలో కల్పించారు. నిర్దేశిత గడవులోగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆటోమేటిక్‌గా వర్క్ పర్మిట్ రెన్యువల్ అయ్యేది.
ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేదాకా వేచి ఉండకుండా రెన్యువల్ కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకుంటే మంచిదని యూఎస్ సిటిజెన్íÙప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్‌సీఐఎస్) స్పష్టంచేసింది. రెన్యువల్ దరఖాస్తు విషయంలో జాప్యం చేస్తే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్(డాక్యుమెంటేషన్)లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.
అసలు ఏమిటీ వర్క్ పర్మిట్?  
కొన్ని కేటగిరీల నాన్–ఇమిగ్రెంట్ వీసాదారులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే వర్క్ పర్మిట్(ఈఏడీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. నాన్–ఇమిగ్రెంట్ విదేశీ కార్మికుడు అమెరికాలో నిర్దేశిత కాలంపాటు ఉద్యోగం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని చెప్పడానికి ఈఏడీ ఒక ఆధారం. గ్రీన్‌కార్డుతో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందినవారికి వర్క్ పర్మిట్‌తో అవసరం లేదు. అయితే, గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే. హెచ్–1బీ వీసాదారులు కూడా పని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
