
‘మద్యం ఉంది.. కానీ ఆ రాత్రి తాగలేదు’
తన వద్ద మద్యం ఉంది వాస్తవమేనని, అయితే, కారు ప్రమాదం చోటు చేసుకున్న రాత్రి మాత్రం తాగలేదని యువ నటుడు విక్రమ్ ఛటర్జీ చెప్పాడు.
కోల్‌కతా: తన వద్ద మద్యం ఉంది వాస్తవమేనని, అయితే, కారు ప్రమాదం చోటు చేసుకున్న రాత్రి మాత్రం తాగలేదని యువ నటుడు విక్రమ్ ఛటర్జీ చెప్పాడు. రోడ్డు ప్రమాదంలో బెంగాల్ నటి, యాంకర్ మోడల్ సోనికా చౌహాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యువ నటుడు విక్రమ్ ఛటర్జీ కూడా ఆమెతో పాటు ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాగి ఉండటం వల్లే కారు ప్రమాదం జరిగిందనే దిశగా పోలీసులు ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విక్రమ్‌ను గత రాత్రి దాదాపు మూడుగంటలపాటు విచారించిన పోలీసులు బుధవారం కూడా మరోసారి స్టేషన్‌కు పిలిపించారు.
ఈ సందర్భంగా అతడు డ్రైవింగ్ చేసే సమయంలో తాగి లేనని చెప్పాడు. తలకు అయిన గాయానికి బ్యాండేజీ కట్టుతోనే వచ్చిన అతడు పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఏప్రిల్ 29న ఓ పబ్బుకు వెళ్లిన వారు తిరిగి వచ్చే క్రమంలో వారి కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయమైన విక్రమ్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. సోనికా కుటుంబ సభ్యులతోపాటు బెంగాలీ సినీ వర్గం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. సోనికా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు విక్రమ్‌పై కేసు నమోదు చేశారు. అయితే, తాను ఏ నేరం చేయలేదని, పోలీసులకు, కోర్టుకు సహకరిస్తానని చెప్పి ప్రస్తుతం విచారణకు హాజరవుతున్నాడు.