నేడే యూపీ, మణిపూర్‌లలో తుదిదశ పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

నేడే యూపీ, మణిపూర్‌లలో తుదిదశ పోలింగ్‌

Published Wed, Mar 8 2017 2:09 AM

నేడే యూపీ, మణిపూర్‌లలో తుదిదశ పోలింగ్‌ - Sakshi

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి దశకు చేరుకున్నాయి. బుధవారం జరిగే ఉత్తరప్రదేశ్‌ ఏడో దశ, మణిపూర్‌ రెండో దశ పోలింగ్‌లతో శాసనసభ ఎన్నికలు ముగుస్తాయి. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ఫిబ్రవరి 4న మొదలైంది. పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న, ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 15న ఒకే దశలో పోలింగ్‌ ముగిసింది.

అన్ని రాష్ట్రాల ఫలితాలు మార్చి 11న వెల్లడవుతాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏడు జిల్లాల్లోని మొత్తం 40 సీట్లకు పోలింగ్‌ జరగనుంది. ఆలాపూర్‌ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో పోలింగ్‌ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ చివరిదైన రెండో దశ పోలింగ్‌ బుధవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 22 సీట్లకు రెండో దశలో ఎన్నికలు జరుగుతాయి. సైనిక బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుదీర్ఘకాలం నిరాహార దీక్ష సాగించిన ఉద్యమకారిణి ఇరోం చాను షర్మిల తౌబాల్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

Advertisement
Advertisement