అబ్బాయి ఫెయిల్‌.. కుటుంబం పండుగ..!!

Father Celebrates As Son Failed X Class Exams - Sakshi

భోపాల్‌, మధ్యప్రదేశ్‌ : పదో తరగతిలో ఫెయిల్‌ అబ్బాయినో లేక అమ్మాయినో ఇంట్లో ఏమంటారు?. ఏం చదివావు ఏడాదిగా అని ప్రశ్నిస్తారు. తప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఓ కుటుంబం మాత్రం ఇందుకు విభిన్నంగా స్పందించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

పదో తరగతి తప్పిన అబ్బాయి చేతికి పుష్పగుచ్ఛం ఇచ్చి, వీధిలో అందరికీ స్వీట్స్‌ పంచిందా కుటుంబం. పెద్ద ఎత్తున మేళతాళాలతో ఊరేగింపును నిర్వహించింది. టపాసులు పేల్చింది. ఎందుకిలా చేస్తున్నారని స్థానికులు అడిగిన ప్రశ్నకు పరీక్షల్లో తప్పినందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, జీవితంలో ఇది ఒక్కటే చివరి పరీక్ష కాదని చెప్పడానికే ఇలా చేస్తున్నామని బాలుడి కుటుంబ సభ్యులు వివరించారు.

నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాయని చెప్పిన కొడుకు అన్షును తండ్రి సురేంద్ర గట్టిగా కౌగిలించుకున్నారని, అనంతరం స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేసి రప్పించారని పేర్కొన్నారు. ఈ ఘటనతో అన్షు ఆశ్చర్యపోయాడని వివరించారు. దీంతో బాలుడి తండ్రి పాజిటివ్‌ థింకింగ్‌కు ఫిదా అయిన స్థానికులు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు.

ఊరేగింపు అనంతరం మాట్లాడిన బాలుడు తనకు చదువుకోవాలని లేదని, తండ్రి ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. సోమవారం మధ్యప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు వెలువడిన గంటల్లోనే దాదాపు 11 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top