
ఫలితాల వెల్లడిలో బోర్డు అధికారుల తప్పిదం
సోషల్‌లో విద్యార్థిని ఫెయిల్ అంటూ ఫలితం
రీవాల్యుయేషన్‌లో 84 మార్కులు సాధించిన వైనం
ముగిసిన ట్రిపుల్ ఐటీ, గురుకుల కళాశాలల అడ్మిషన్ల గడువు
జమ్మలమడుగు : ఫలితాల వెల్లడిలో ఎస్‌ఎస్‌సీ బోర్డు ఫెయిలైంది. బోర్డు అధికారుల తప్పిదం వల్ల ఓ విద్యార్థిని నష్టపోయింది. ఆమె భవిత అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్‌లో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్‌లో ఫెయిల్ అయినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ఆమె తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిషులో 84, గణితంలో 93, సైన్స్‌లో 98 మార్కులు సాధించింది.
సోషల్‌లో మాత్రం 21 మార్కులే వచ్చినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు మార్కుల లిస్టు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి వెయ్యి రూపాయలు కట్టి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు. అధికారులు జవాబుపత్రం రీవాల్యూయేషన్ చేసి 84 మార్కులు సాధించినట్టు ఫలితంతోపాటు జవాబుపత్రం పంపారు. అంటే ఆమెకు ఏకంగా 63 మార్కులు పెరిగాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ట్రిపుల్ ఐటీ, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ముగిసిపోయింది. మొత్తం ఆరు సబ్జెక్టుల్లో దీక్షితకు 537 మార్కులు వచ్చాయి. అంటే ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. వాల్యూయేషన్ అధికారుల తప్పిదం వల్ల ఆ అవకాశం తప్పిపోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత తీవ్రంగా కలత చెందుతోంది.
ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్‌లో మంగళవారం తండ్రితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని కోరింది. వాల్యూయేషన్ చేసిన అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు ఏపీ రెసిడెన్షియల్, గురుకుల, ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది.