బాలిక ప్రాణం కాపాడిన ఫేస్‌బుక్‌

Facebook Alert Saves Assam Girl - Sakshi

గువహటి : అమెరికాలోని ఫేస్‌బుక్‌ కార్యాలయం నుంచి వచ్చిన అలర్ట్‌తో అసోం పోలీసులు ఓ బాలిక ప్రాణాలు కాపాడగలిగారు. 'ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను' అని ఓ బాలిక ఫేస్‌ బుక్‌ స్టేటస్‌లో పోస్ట్‌ పెట్టింది. దీన్ని గమనించిన ఫేస్‌బుక్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని సిబ్బంది వెంటనే అసోం పోలీసులకు సమాచారం అందించారు.

'ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను' అని  బాలిక ఫేస్‌బుక్‌ స్టేటస్‌లో పోస్ట్‌ పెట్టిందని .. ఫేస్‌బుక్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సమాచారం రావడంతో అసోం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేవలం 30 నిమిషాల్లోనే బాలిక లొకేషన్‌ను కనుగొని, ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగారు. బాలికతో పాటూ ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం కుటుంబసభ్యుల పర్యవేక్షణలో బాలిక క్షేమంగా ఉందని అసోం పోలీసులు తెలిపారు. ఫేస్‌ బుక్‌ ఇచ్చిన సమాచారంతో ఓ బాలిక ప్రాణాలను కాపాడగలగడం ఎంతో సంతోషంగా ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

పోలీసుల సలహాతో బాలిక ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును డెలీట్‌ చేసింది. ఫేస్‌బుక్‌ నుంచి నోడల్‌ ఆఫీసర్‌కు అలర్ట్‌ రావడంతో ఆ అధికారి సోషల్‌మీడియా సెంటర్‌ను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత వెనువెంటనే బాలిక లొకేషన్‌ను ఫీల్డ్‌ అధికారులకు పంపడంతో వారు బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. సోషల్‌ మీడియా సెంటర్‌ను ప్రత్యేకంగా ప్రారంభించడం వల్లే ఈ విజయం సాధించగలిగామని అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏడీజీపీ) ఆఫ్‌ అసోం హర్మిత్‌ సింగ్‌ తెలిపారు.

సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ కారణంగా గతనెలలో పిల్లల్నిఎత్తుకుపోయేవాళ్లనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులను అసోంలోని కర్బిఅంగ్‌లాంగ్‌ జిల్లాలో దారుణంగా కొట్టి చంపారు. దీంతో అక్కడి పోలీసు యంత్రాంగం సోషల్‌ మీడియాపై నిఘా కోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల నియంత్రణకు 'థింక్‌' అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తుందని, సామాన్యులు కూడా పోలీసులను సులభంగా సంప్రదించే అవకాశం లభించిందని హర్మిత్‌ సింగ్‌ తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top