నిత్యం వాడే వివిధ రకాల ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గే అవకాశం ఉంది.
సెప్టెంబరు 9న తుది నిర్ణయం తీసుకోనున్న మండలి
న్యూఢిల్లీ: నిత్యం వాడే వివిధ రకాల ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గే అవకాశం ఉంది. 20కి పైగా వస్తువులకు పన్ను రేటును నిర్ణయించడంలో గతంలో కొన్ని అవకతవకలు జరిగినందున వాటిని సరిదిద్దాలని జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ జీఎస్టీ మండలికి సూచించింది. ప్రస్తుతం బ్రాండెడ్ కాని ఆహార పదార్థాలపై పన్ను లేకపోగా, బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
దీంతో పన్ను భారాన్ని తప్పించుకునేందుకు కంపెనీలు తమ ఉత్పత్తులను బ్రాండెడ్ జాబితా నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. కాబట్టి మే 15నాటికి ఏ ఆహార ఉత్పత్తులు బ్రాండెడ్ జాబితాలో ఉండేవో వాటన్నింటిపై (తర్వాతి కాలం లో బ్రాండెడ్ నుంచి తప్పించినా) పన్ను విధించాలని ఫిట్‌మెంట్ కమిటీ జీఎస్టీ మండలికి సిఫారసు చేసింది. సెప్టెంబరు 9న హైదరాబాద్‌లో జరిగే తదుపరి సమావేశంలో మండలి తుదినిర్ణయం తీసుకోనుంది.