breaking news
branded list
-
రూ.70 కోట్లు పలికిన హ్యాండ్ బ్యాగ్
పారిస్: అక్కడక్కడా చిరిగిపోయి, మరకలు పడి, బాగా వాడేసిన నల్లని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. కానీ అది అలాంటిలాంటి బ్యాగ్ కాదు. అలనాటి అందాల హాలీవుడ్ నటి వాడిన బ్యాగ్. ఆ క్రేజ్ వల్లేనేమో, ప్రఖ్యాత ఫ్రెంచ్ నటి దివంగత జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ ఏకంగా 82 లక్షల డాలర్లకు, అంటే దాదాపు రూ.70 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక హ్యాండ్ బ్యాగ్‌కు ఇంతటి ధర పలకడం వేలంపాటల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రఖ్యాత సోత్బీ వేలం సంస్థ దీనిని గురువారం ఆన్లైన్లో విక్రయించింది. 10 లక్షల డాలర్ల బిడ్డింగ్‌తో మొదలైన వేలం పాట క్షణాల్లో కోట్లు దాటేసి కొత్త రికార్డ్‌ను కొట్టేసింది. ఎట్టకేలకు జపాన్‌కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగును సొంతం చేసుకున్నారు. ఎవరీ బిర్కిన్? తన అందం, అభినయంతో ఫ్రెంచ్ సినిమాలను ఒక ఊపు ఊపిన అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్. నేపథ్య గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, సామాజిక కార్యకర్తగా... ఇలా పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారామె. నాటి సినీ, ఫ్యాషన్ ప్రపంచ ఐకాన్‌గా వెలిగిపోయారు. 1946 డిసెంబర్ 14న లండన్‌లోని మేరీలీబాన్లో జన్మించారు. 76వ ఏట పారిస్‌లో తుదిశ్వాస విడిచారు. హెర్మ్స్ లగ్జరీ వస్తువుల సంస్థ ప్రత్యేకంగా బిర్కిన్ కోసమే 1984లో ఈ బ్యాగును తయారుచేసింది. పారిస్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో బిర్కిన్ పక్క సీటులో హెర్మ్స్ సంస్థ చైర్మన్ జీన్ లూయిస్ డ్యూమస్ ప్రయాణించారు. ‘‘విమానం ఎక్కినప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాంతి చేసుకునే కవర్లో పెట్టుకోవాల్సి వస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్ బ్యాగులన్నీ చిన్నగా ఉన్నాయి. అల్లిన బుట్టను వాడడం ఇబ్బందిగా ఉంది. కాస్తంత పెద్ద బ్యాగు తయారు చేయొచ్చుగా!’’ అని అతడిని బిర్కిన్ కోరింది. అడిగిందే తడవుగా సంస్థలోని నిష్ణాతులను పురమాయించి అత్యంత నాణ్యమైన తోలుతో, ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్‌ను తయారు చేయించి 1985లో ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ బ్యాగులను ఇకపై మీ పేరుతో అమ్ముకోవచ్చా అని అడిగితే ఆమె సరేనన్నారు. ఆమె చాన్నాళ్లపాటు అంటే 1985 నుంచి 1994 దాకా రోజూ ఆ బ్యాగును వెంట తీసుకెళ్లేది. అందాల నటి చేతిలో మరింత అందంగా కనిపించిన ఆ బ్యాగుకు ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయింది. తర్వాత మరో నాలుగు బ్యాగులను కూడా కంపెనీ నుంచి ఆమె బహుమతిగా అందుకున్నారు. కానీ ఈ బిర్కిన్ బ్యాగు మాత్రం ఫ్యాషన్ చిహ్నంగా స్ధిరపడింది. దాంతో హెర్మ్స్ తయారీ బిర్కిన్ బ్యాగుల ధర సైతం అమాంతం పెరిగిపోయింది. కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్‌గా మారిపోయింది.బ్యాగుతో పాటు గోళ్ల కత్తెర బిర్కిన్కు గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం అలవాటు. అందుకే ఆమెకు బహూకరించిన బ్యాగుకు కంపెనీ వెండి గోళ్ల కత్తెరనూ జతచేసింది. జిప్ లాక్ చేయడానికి బుల్లి తాళం కూడా ఇచ్చింది. బ్యాగుకు యూనిసెఫ్, మెడిసిన్స్ డ్యూ మోండే వంటి మానవీయ సంస్థల గుండ్రని స్టిక్కర్లను అతికించారామె. బిర్కిన్ 2023లో చనిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘నా నటన, గానం, ఫ్యాషన్, సమాజసేవతో పాటు నేను చనిపోయాక నా బ్యాగ్ గురించి కూడా జనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో!’ అని అన్నారు. ఆమె ఊహించినట్లే లగ్జరీ వస్తువుల ప్రపంచంలో ఇప్పుడా బ్యాగు ప్రత్యేక స్థానం ఆక్రమించుకుందని సోత్బీ హ్యాండ్‌బ్యాగులు, యాక్సెసరీల గ్లోబల్ హెడ్ మోర్గాన్ హ్యాలిమీ వ్యాఖ్యానించారు. ఒరిజినల్ బ్యాగును ఎయిడ్స్ ఛారిటీ నిధి కోసం వేలం పాట సంస్థకు ఆమె 1994లోనే ఇచ్చేశారు. 2000లో అది మరోసారి వేలానికి వచి్చంది. తర్వాత పాతికేళ్లుగా ఎవరికీ కనిపించలేదు. ఇన్నాళ్లకు సోత్బీ దాన్ని దక్కించుకుని గురువారం ఇలా రికార్డు స్థాయిలో విక్రయించింది. ఈ బ్యాగు మోడల్ అంటే తమకెంతో ఇష్టమని పలువురు సెలెబ్రిటీలు, ఆరి్టస్టులు, స్టైలిస్టులు గతంలో చెప్పారు. -
20 వస్తువులపై తగ్గనున్న జీఎస్టీ రేటు!
సెప్టెంబరు 9న తుది నిర్ణయం తీసుకోనున్న మండలి న్యూఢిల్లీ: నిత్యం వాడే వివిధ రకాల ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గే అవకాశం ఉంది. 20కి పైగా వస్తువులకు పన్ను రేటును నిర్ణయించడంలో గతంలో కొన్ని అవకతవకలు జరిగినందున వాటిని సరిదిద్దాలని జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ జీఎస్టీ మండలికి సూచించింది. ప్రస్తుతం బ్రాండెడ్ కాని ఆహార పదార్థాలపై పన్ను లేకపోగా, బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో పన్ను భారాన్ని తప్పించుకునేందుకు కంపెనీలు తమ ఉత్పత్తులను బ్రాండెడ్ జాబితా నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. కాబట్టి మే 15నాటికి ఏ ఆహార ఉత్పత్తులు బ్రాండెడ్ జాబితాలో ఉండేవో వాటన్నింటిపై (తర్వాతి కాలం లో బ్రాండెడ్ నుంచి తప్పించినా) పన్ను విధించాలని ఫిట్మెంట్ కమిటీ జీఎస్టీ మండలికి సిఫారసు చేసింది. సెప్టెంబరు 9న హైదరాబాద్‌లో జరిగే తదుపరి సమావేశంలో మండలి తుదినిర్ణయం తీసుకోనుంది.