ఆవుల్ని పెంచుకోండి.. పాన్‌షాప్‌ పెట్టుకోండి..

Don't Run After Govt Jobs, Milk Cows - Sakshi

నిరుద్యోగ యువతకు త్రిపుర సీఎం బిప్లవ్‌ సలహా  

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేబ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యావంతులైన యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలని లేదంటే పాన్‌షాప్‌ పెట్టుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల చుట్టూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడం వల్ల జీవితంలో విలువైన సమయం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. త్రిపుర వెటర్నరీ కౌన్సిల్‌ ఆదివారం నాడిక్కడ నిర్వహించిన ఓ సెమినార్‌లో బిప్లవ్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంట్లో ఓ ఆవు ఉండాలి.

ఒక్కో లీటర్‌ ఆవుపాలు ప్రస్తుతం రూ.50గా ఉంది. పదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడానికి బదులుగా పాలు అమ్ముకుని ఉంటే ప్రస్తుతం ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు ఉండేవి. కనీసం రూ.75 వేల పెట్టుబడితో కొంచెం కష్టపడితే నెలకు వీరు రూ.25,000 ఆర్జించవచ్చు. కానీ గత 25 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు సంస్కృతే దీనికి అడ్డంకిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. ‘కనీసం 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాలని అధికారులకు నేను చెప్పాను. ఆవుల్ని, పందుల్ని, కోళ్లను పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

రాబోయే మూడు నెలల్లో 3,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని వెల్లడించారు. గతంలో ఓ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పకోడీలు అమ్ముకుని రోజుకు రూ.200 ఆర్జించేవారిని నిరుద్యోగులుగా పరిగణించలేమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యావంతులు వ్యవసాయం చేయలేరన్న సంకుచిత మనస్తత్వమే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని బిప్లవ్‌ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు సివిల్స్‌ పరీక్షను సివిల్‌ ఇంజనీర్లే రాయాలనీ, మెకానికల్‌ ఇంజనీర్లు రాయకూడదంటూ బిప్లవ్‌ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top