రైతును చులకనగా చూడొద్దు | Sakshi
Sakshi News home page

రైతును చులకనగా చూడొద్దు

Published Mon, Nov 24 2014 10:56 PM

don't deprecated it in favor to farmer :uddhav thackeray

 నాందేడ్, న్యూస్‌లైన్: రైతులను అవమానించేలా వ్యాఖ్యలుచేస్తే సహించేదిలేదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సేను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. రైతులును అవహేళన చేయవద్దు, లేదంటే అజిత్ పవార్ మాదిరిగానే ప్రజలు మిమ్నల్ని కూడా ఇంటికి పంపించేస్తారని వ్యాఖ్యానించారు. ‘సెల్ ఫోన్ల బిల్లులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి... కాని విద్యుత్ బిల్లులు ఎందుకు కట్టడంలేదని ఏక్‌నాథ్ ఖడ్సే రైతులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. మంత్రి వ్యాఖ్యలు రైతులను అవమానించేలా ఉన్నాయని, ఆయన వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి.

కాగా,  తీవ్రనీటి ఎద్దడితో సతమతమవుతున్న మరాఠ్వాడా పర్యటనలో భాగంగా ఉద్ధవ్‌ఠాక్రే సోమవారం నాందేడ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకునేదిపోయి చులకనచేసి మాట్లాడడం సబబుకాదని ఏక్‌నాథ్ ఖడ్సేకు హితవుపలికారు. ‘సెల్ ఫోన్‌లకు నిరంతరం నెట్‌వర్క్ ఉంటుంది..  కాని విద్యుత్ సరఫరా నిరంతరం ఉంటోందా అని ఆయన మంత్రిని ప్రశ్నించారు. రైతులను అవహేళన చేసిట్టయితే ప్రజలు అజిత పవార్‌ను పంపించినట్టుగానే మిమ్నల్ని కూడా ఇంటికి పంపిస్తారని ఖడ్సేకు చురకలంటించారు. అనంతరం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులతో ఉద్ధవ్ భేటీ అయ్యారు. వారిని ఓదార్చుతూ ఇకపై రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.

 రాజకీయంపై ఓడిన ‘విక్రాంత్’: శివసేన
 ముంబై: శత్రుదేశంపై యుద్ధంలో దేశాన్ని గెలిపించిన విక్రాంత్ యుద్ధనౌక తన అస్థిత్వం కాపాడుకోవడానికి చేసిన యుద్ధంలో మాత్రం ఓడిపోయిందని శివసేన ఆవేదన వ్యక్తం చేసింది. ‘సామ్నా’ పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో శివసేన పైవిధంగా వ్యాఖ్యానించింది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 కాగా, 1997 డిసెంబర్ నుంచి ఈ నౌక సేవలను నిలిపివేశారు. అనంతరం దీన్ని మ్యూజియంగా మార్చాలా లేక స్క్రాప్ కింద మార్చివేయాలా అనే విషయమై పెద్ద చర్చే జరిగింది. దీని నిర్వహణ భారాన్ని తాము మోయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. కాగా, రూ. 100 -150 కోట్ల ఖర్చుతో దీన్ని స్క్రాప్ కింద మార్చకుండా మ్యూజియంగా మార్చేందుకు అవకాశముందని పలువురు మేధావులు సూచించగా, ఆ మేరకు నిధులు కూడా తాము ఖర్చు పెట్టలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది.

కాగా, ఈ నౌకను స్క్రాప్ కింద మార్చేందుకు వీలులేదని ఈ ఏడాది జవనరిలో బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే అది కోర్టులో వీగిపోవడంతో గత వారం నౌకను స్క్రాప్‌గా మార్చే ప్రక్రియ మొదలైంది. మన దేశ వారసత్వ సంపదగా నిలవగలిగే విక్రాంత్‌ను కాపాడుకోవడానికి కేవలం రూ.100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయిందని ప్రభుత్వంపై శివసేన మండిపడింది.

Advertisement
Advertisement