ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష

Discrimination against women in places of prayer - Sakshi

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వేర్వేరు మతాల్లో, ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి ఏయే అంశాలపై చర్చించాలో నిర్ణయించేందుకు ఈ నెల 17న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం నలుగురు సీనియర్‌ న్యాయవాదులను సోమవారం ఆదేశించింది. ఇదే సమయంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని స్పష్టం చేసింది. ‘‘శబరిమల కేసులో తీర్పును సమీక్షించబోవడం లేదు. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తావించిన అంశాలను పరిగణిస్తున్నాం’’ అని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తెలిపింది.

మతపరమైన వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం ఎంతవరకూ ఉండాలన్న దానిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొన్ని అంశాలను లేవనెత్తిందని, వాటిపై మాత్రమే తాము విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థన స్థలాల్లో మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం ఒక్క శబరిమలకు మాత్రమే పరిమితం కాలేదని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా... ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించే హక్కు కల్పించే ఆర్టికల్‌ 25, 26, రాజ్యాంగ నైతికత అన్న అంశం, మత వ్యవహారాల్లో న్యాయస్థానాలు ఎంత మేరకు జోక్యం చేసుకోవచ్చు? వంటి ఏడు అంశాలను ఐదుగురు సభ్యుల ధర్మాసనం లేవనెత్తింది. అయితే ధర్మాసనం ఈ అంశాలపై సీనియర్‌ న్యాయవాదులు నలుగురు సమావేశమై చర్చించాలని ఆదేశించడం గమనార్హం. 

పరిశీలనకు ఇవి..: మసీదుల్లో మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా తెగల్లో మహిళల జననాంగాల విచ్చిత్తి, పార్శీ మహిళను పెళ్లాడిన పార్శీయేతర పురుషులకు వారి ప్రార్థన స్థలంలో ప్రవేశంపై నిషేధం వంటి పలు అంశాలపై దాఖలైన పిటిషన్లను వేరుగా విచారించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీలతో కూడిన నలుగురు సీనియర్‌ న్యాయవాదులు సమావేశమై ఏయే అంశాలపై తాము విచారణ జరపాలో సూచించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరు ఏ అంశంపై వాదిస్తారన్నది నిర్ణయించుకోవాలంటూ.. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top