డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ మార్కెట్‌పై.. విదేశీ పెత్తనం | Digital advertising industry to grow by 27 percent in 2020 | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ మార్కెట్‌పై.. విదేశీ పెత్తనం

Jul 5 2020 12:48 AM | Updated on Jul 5 2020 11:00 AM

Digital advertising industry to grow by 27 percent in 2020 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్‌ కాలంలో కాటన్‌ ఎగుమతి చేసి బట్ట లు దిగుమతి చేసుకునేవాళ్లమని పెద్దలు చెబుతుంటారు. ఇదే తరహాలో మన దేశం ఒక విచిత్ర సమస్య ఎదుర్కొంటోంది. మనం సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ప్లాట్‌ఫామ్‌లు మనమే క్రియేట్‌ చేసి ఇస్తున్నాం. కంటెంట్‌ మనదే. పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు మనవాళ్లే. ప్రకటనలపై వెచ్చించేది మనవాళ్లే. ఆదాయం మాత్రం.. ఈ ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇస్తున్న విదేశీ డిజిటల్‌ యాడ్స్‌ ఏజెన్సీలది. మనకు గూగుల్‌ కేవలం ఒక సెర్చ్‌ ఇంజిన్‌గా మాత్రమే తెలుసు. కానీ దీని ప్రధాన ఆదాయ వనరు డిజిటల్‌ యాడ్స్‌. కం పెనీల నుంచి యాడ్స్‌ తీసుకోవడం, డిజిటల్‌ పబ్లిషర్స్‌కు ప్రచురించేందుకు ఇవ్వడం.

దీని ద్వారా డిజిటల్‌ పబ్లిషర్స్‌కు కొంత ఇవ్వడం, అది కొంత వాటా తీసుకోవడం. ఫేస్‌బుక్‌ మనకు కేవలం సోషల్‌ మీడియాగానే తెలుసు. కానీ మనం ఒక యాడ్‌ ఇవ్వాలనుకున్నా, ఒక పోస్ట్‌ చాలా మందికి చేరాల నుకున్నా మనం డబ్బులు వెచ్చించాలి. అంటే కేవలం తన సోషల్‌ మీడియా యాప్‌లోనే యాడ్స్‌ ప్రచురించి సొమ్ము చేసు కుంటుంది.  యూజర్స్‌ మనమే. డబ్బులు వెచ్చించేది చాలావరకు భారతీయ కంపెనీలే. చూసేది మనమే. క్లిక్‌ చేసేది మనమే. ఆయా యాప్‌లను నిర్మించింది, నిర్మించే సత్తా ఉంది మన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకే. ఈ యాప్‌లు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి. కానీ మన పబ్లిషర్లకు పెద్దగా మిగిలిందేమీ లేదు.

చైనా యాప్స్‌ బ్యాన్‌ ప్రభావం ఎలా ఉండబోతోంది..
59 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం, వోకల్‌ ఫర్‌ లోకల్‌ పిలుపు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇండియా డిజిటల్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగం స్వదేశీ కంపెనీలను ఆకర్షిస్తోంది. 80 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్న దేశంలో ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇచ్చే డిజిటల్‌ ఏజెన్సీలకు, స్వదేశీ సోషల్‌ మీడియా యాప్‌లకు, ఆన్‌లైన్‌ వీడియో యాప్‌లకు, స్వదేశీ ఓటీటీలకు భారీ అవకాశాలు ముందున్నాయి. అలాగే స్వదేశీ బ్రౌజర్లు, స్వదేశీ న్యూస్‌ అగ్రిగేటర్లు, స్వదేశీ న్యూస్‌ యాప్‌లకు బోలెడు అవకాశాలు ఆహ్వానం పలుకనున్నాయి. కంటెంట్, యూజర్లు, ప్రకటనలకు కొదవలేనందున ప్లాట్‌ఫామ్‌లు కూడా స్వదేశీ అయితే దేశ ఆర్థిక వృద్ధిలో అవీ భాగమవుతాయి.

డెంట్సూ నివేదిక  ఏం చెప్పింది?
గూగుల్‌ యాడ్స్, ఫేస్‌బుక్‌ యాడ్స్, టిక్‌టాక్‌ యాడ్స్‌(టిక్‌టాక్‌ యాప్‌ను కేంద్రం బ్యాన్‌ చేసింది) ఇలాంటి డిజిటల్‌ యాడ్‌ ఏజెన్సీల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో డెంట్సూ ఏజిస్‌ నెట్‌వర్క్‌(డీఏఎన్‌) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ ఇండస్ట్రీ 2019–20 నాటికి రూ. 13,683 కోట్ల టర్నోవర్‌తో ఉంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 26 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2020–21 నాటికి ఇది రూ.17 వేల కోట్లకు చేరనుంది. అలాగే 2022 నాటికి డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ ఇండస్ట్రీ రూ.28,249 కోట్లకు, 2025 నాటికి రూ.58,550 కోట్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల ఇండస్ట్రీ టర్నోవర్‌ మొత్తం మన దేశంలో రూ.68,475 కోట్లు ఉండగా.. 2025 నాటికి రూ.1,33,921 కోట్లకు చేరనుంది. ఈ రంగం ఏటా 11 శాతం వృద్ధి సాధిస్తుండగా.. డిజిటల్‌ యాడ్స్‌ రంగం మాత్రం ఏటా 27.42 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకోనుందని డెంట్సూ ఏజిస్‌ నెట్‌వర్క్‌(డీఏఎన్‌) తన నివేదికలో తెలిపింది.

దూసుకుపోతున్న మొబైల్‌ యాడ్‌  మార్కెట్‌
చవకైన డేటా ప్లాన్స్, స్మార్ట్‌ ఫోన్ల అందుబాటు కారణంగా డిజిటల్‌ యాడ్స్‌పై వెచ్చించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ మార్కెట్లలో మొబైల్‌ యాడ్స్‌పై వెచ్చించే మొత్తం ప్రస్తుతం 40 శాతం ఉంది. అది ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 52 శాతానికి చేరనుంది. మిలీనియల్స్‌ను దృష్టిలోపెట్టుకుని అడ్వర్టయిజ్‌మెంట్లపై కంపెనీలు వెచ్చించడం ఇటీవల పెరిగింది. యువత వీటిపై రోజుకు సగటున 2.5 గంటలు వెచ్చిస్తున్నట్టు డీఏఎన్‌ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, షేర్‌చాట్, రొపోసో వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ నిండా మిలీనియల్స్‌ను దృష్టిలో పెట్టుకుని కంటెంట్‌ ఉంటుంది. అలాగే మ్యూజిక్‌ యాప్‌లు, యూట్యూబ్‌ వీడియోలు.. ఇలా డిజిటల్‌ అడ్వర్టయిజ్‌మెంట్లకు వేదికగా మారాయి. డిజిటల్‌ అడ్వర్జయిమెంట్‌ వ్యయం సోషల్‌ మీడియాపై 28 శాతం ఉండగా.. పెయిడ్‌ సెర్చ్‌పై 25 శాతం, ఆన్‌లైన్‌ వీడియోపై 22 శాతం ఉంది. ఆన్‌లైన్‌ వీడియోలపై వెచ్చించే డిజిటల్‌ అడ్వర్టయిజ్‌మెంట్ల వృద్ధిరేటు 32 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement