ఢిల్లీ అల్లర్లు: కాల్చి పడేస్తా అన్నాడు.. దాంతో..

Delhi Cop Recalls Man Threatened Him With Gun Incident Delhi Clashes - Sakshi

న్యూఢిల్లీ: ‘‘అతను నన్ను కాల్చి పారేస్తానని బెదిరించాడు. తన వెనుక ఉన్న వాళ్లు నాపై రాళ్లు రువ్వారు. అయితే నా ప్రాణం కంటే కూడా.. ఇతరుల ప్రాణాలు కాపాడటమే ముఖ్యం. కాబట్టి తనను బెదిరించే ప్రయత్నం చేశాను’’ అంటూ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ దీపక్‌ దహియా తనకు ఎదురైన అనుభవం గురించి మీడియాకు వివరించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల్ల మధ్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక నిరసనకారుడొకరు తుపాకీ చేతపట్టి జఫ్రాబాద్‌లో హల్‌చల్‌ చేశాడు. డ్యూటీలో ఉన్న దీపక్‌ దహియాకు గన్‌ గురిపెట్టి బెదిరించాడు. ఈ నేపథ్యంలో దీపక్‌ దహియా ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ... సోమవారం నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. (ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్‌ మృతదేహం)

‘‘ ఆరోజు తను నావైపు దూసుకొచ్చాడు. నేను తనను ఆపబోయాను. వెంటనే చేతిలో ఉన్న గన్‌తో నన్ను బెదిరించాడు. అడ్డుతప్పుకోకుంటే కాల్చి పారేస్తానన్నాడు. అయినా నేను వెనక్కితగ్గలేదు. దాంతో వరుసగా కాల్పులు జరిపాడు. అతని వెనుక ఉన్న వాళ్లు రాళ్లు విసిరారు. దీంతో నా వెనుక ఉన్న ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు. ఎవరికీ హాని చేయవద్దని అతడిని చాలా బతిమిలాడాను. చేతిలో ఉన్న కర్రతో అతడిని బెదిరించడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతలో మరో 25 మంది చేతుల్లో రాళ్లు పట్టుకుని వచ్చారు. వారంతా అతడి వెనుక వెళ్లిపోయారు’’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగుతున్న అల్లర్లలో సామాన్య పౌరులతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌, ఐబీ కానిస్టేబుల్‌ అంకిత్‌ శర్మ కూడా మృతి చెందారు. 200కు పైగా మంది గాయపడ్డారు. సోమవారం మొదలైన ఈ అల్లర్లు నేటికీ కొనసాగుతున్నాయి.(‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top