‘డిఫెన్స్’ కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు | 'Defense' centers in Hyderabad and Bangalore | Sakshi
Sakshi News home page

‘డిఫెన్స్’ కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు

Feb 6 2015 3:39 AM | Updated on Sep 4 2018 5:07 PM

‘డిఫెన్స్’ కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు - Sakshi

‘డిఫెన్స్’ కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు

రక్షణ సహకారంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలను అమెరికన్ కంపెనీలు టెక్నాలజీ సెంటర్లుగా మార్చనున్నాయి.

  • దక్షిణాది నగరాలను ఎంచుకున్న అమెరికన్ కంపెనీలు
  • భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ వెల్లడి
  • న్యూఢిల్లీ: రక్షణ సహకారంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలను అమెరికన్ కంపెనీలు టెక్నాలజీ సెంటర్లుగా మార్చనున్నాయి. భారత్-అమెరికా భాగస్వామ్యంలో భాగంగా రక్షణ రంగంలో సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తి చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో దక్షిణాదిలో కీలకమైన ఈ రెండు నగరాలను అమెరికా ఎంచుకుంది. ప్రధాని మోదీతో అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా చర్చల సందర్భంగా ఇందుకు నాంది పడినట్లు భారత్‌లోని ఆ దేశ రాయబారి రిచర్డ్ వర్మ పేర్కొన్నారు.

    వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వచ్చే శతాబ్ధంలో ఇరు దేశాల బంధం ఎంతో బలపడనుందని, రక్షణ రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యం ఎంతగా పెనవేసుకుంటే అంతటి బలమైన బంధం ఏర్పడిందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చునని రిచర్డ్ వర్మ తెలిపారు.

    యుద్ధవిమానాల తయారీలోనూ ఇరు దేశాలు కలిసి పాలుపంచుకోవడం గొప్ప ముందడుగని, ఏడాది కిందట ఎవరూ దీన్ని కనీసం ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు.  రక్షణకు సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీల అభివృద్ధికి అమెరికన్ కంపెనీలు.. హైదరాబాద్, బెంగళూరు నగరాలను కీలక స్థావరాలుగా మలచుకుంటాయని రిచర్డ్ పేర్కొన్నారు.

    చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మిలటరీ ఒప్పందాలను ఖరారు చేసుకోడానికి ఇరుదేశాలు కృషి చేస్తాయన్నారు.   సీఐఎస్‌ఎంవోఏ, జియోస్పేషియల్ సహకారం, లాజిస్టిక్స్ సహకార ఒప్పందాల విషయంలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులోనూ ఇరు దేశాలు సంయుక్తంగా ముందుకు సాగుతున్నాయన్నారు.

    భారత్‌లో గాంధీకే దిగ్భ్రమ కలిగించే మత అసహనం: ఒబామా

    భారతదేశంలో అన్ని రకాల మతవిశ్వాసాలు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న అసహన చర్యలు మహాత్మా గాంధీని దిగ్భ్రాంతికి గురిచేసి ఉండేవని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇటీవల భారత పర్యటన ముగింపు సందర్భంగా బహిరంగంగా ప్రసంగిస్తూ మత సహనం గురించి ప్రస్తావించటం బీజేపీ లక్ష్యంగానే చేశారనే వాదనను  శ్వేతసౌధం బుధవారం ఖండించింది. కానీ, గురువారం వాషింగ్టన్‌లో జరిగిన ‘నేషనల్ ప్రే యర్ బ్రేక్‌ఫాస్ట్’ కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ, ‘‘భారత్‌లో కొంతకాలంగా ఇతర మతవిశ్వాసాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ అసహన చర్యలు.. ఆ జాతిని విముక్తం చేసేందుకు దోహదపడిన గాంధీజీని దిగ్భ్రాంతికి గురిచేసి ఉండేవి’’ అని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement