ఆగని వరదలు

Death toll rises to 201 in floods - Sakshi

భారీ వర్షాలతో అల్లాడుతున్న కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌

సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

కర్ణాటక, మహారాష్ట్రల్లో హోంమంత్రి అమిత్‌ షా ఏరియల్‌ సర్వే

హంపీలోకి చొచ్చుకొచ్చిన వరద.. పర్యాటకులు సురక్షితం  

న్యూఢిల్లీ/తిరువనంతపురం/బెంగళూరు/ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లోని వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆదివారం నాటికి కేరళలో 72 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 32 మంది మహారాష్ట్రలో 35 మంది, గుజరాత్‌లో 31 మంది, కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 201కు చేరుకుంది. మరోవైపు సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు వీలుగా ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, కోస్ట్‌ గార్డ్, నేవీ బృందాలతో పాటు వాయుసేనను(ఐఏఎఫ్‌) హెలికాప్టర్లను కూడా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్డుమార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, తాగునీరు అందజేస్తున్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన హంపీలోకి వరదనీరు చొచ్చుకురావడంతో అధికారులు పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
అమిత్‌ షా ఏరియల్‌ సర్వే..
కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగాఆదివారం నాటికి కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కర్ణాటక సీఎం యడియూరప్ప, ఇతర ముఖ్యనేతలతో కలిసి బెళగావి, బాగల్‌కోటే, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం షా స్పందిస్తూ..‘ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి’ అని ట్వీట్‌ చేశారు.  వర్షాలు కొంచెం తెరిపినిచ్చినప్పటికీ కొండచరియలు విరిగిపడే ప్రమాదముందనీ, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ సూచించారు. తన నియోజకవర్గమైన వయనాడ్‌కు చేరుకున్న రాహుల్‌ గాంధీ ఓ పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు. బాధితులకు తక్షణసాయం అందించాలని  ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.  
 
కేంద్రం వివక్ష చూపుతోంది: కాంగ్రెస్‌

వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్‌  విమర్శించింది. పార్టీ ప్రతినిధి జైవీర్‌ షేర్‌గిల్‌ మాట్లాడుతూ..‘వరదలు లేకున్నా ఉత్తరప్రదేశ్‌కు రూ.200 కోట్లు కేటాయించి, వరదలతో అతలాకుతలమైన అస్సాంకు రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతేడాది భారీ వర్షాలు, వరదలతో కేరళకు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం జరిగితే రూ.3 వేల కోట్లు్లమాత్రమే ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు.  

సూపర్‌ పోలీస్‌..
సాక్షి, అమరావతి : గుజరాత్‌లో వరదలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు ఓ పోలీస్‌ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మోర్బీ జిల్లా కల్యాణ్‌ పూర్‌ గ్రామంలోని పాఠశాలలో 43 మంది చిన్నారులు చదువుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉపాధ్యాయులు, పిల్లలు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ వరద ఉధృతికి బోట్లు ముందుకు కదలకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానిస్టేబుల్‌ పృథ్వీరాజ్‌ జడేజా ఇద్దరు బాలికల్ని భూజాలపై కూర్చోబెట్టుకుని నడుములోతులో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిని దాటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top