బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం

Cyclonic storm claims 2 lives in Odisha and Bengal - Sakshi

బుధవారం మధ్నాహ్నం తీరం దాటిన ఉంపన్‌ తుపాను

రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పెను గాలులు

పశ్చిమబెంగాల్‌లో ముగ్గురు మృతి

బంగ్లాదేశ్‌పైనా తీవ్ర ప్రభావం

సాక్షి, విశాఖపట్నం/కోల్‌కతా/భువనేశ్వర్‌: అతి తీవ్ర తుపాను ‘ఉంపన్‌’ పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో.. ప్రాణనష్టం తప్పినా.. ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది. పశ్చిమబెంగాల్‌లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా ఉంపన్‌ తీరం దాటింది. ఆ సమయంలో తీరం వెంబడి బీభత్సం సృష్టించింది. (తగ్గుతున్న వెరీయాక్టివ్‌ క్లస్టర్లు)

గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భారీగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ ధ్వంసమయింది. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. తీరం దాటే సమయంలో తీరంలో అలలు భారీగా ఎగసిపడ్డాయి. కోల్‌కతాలో లోతట్టు ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. ఒడిశాలో పురి, ఖుర్ద, జగత్సింగ్‌పుర్, కటక్, కేంద్రపార, జాజ్‌పుర్, గంజాం, భద్రక్, బాలాసోర్‌ల్లో మంగళవారం నుంచి భారీ వర్షపాతం నమోదైంది.

తుపాను ప్రభావం ప్రారంభమవడానికి ముందే రెండు రాష్ట్రాల్లో 6.58 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలి తమపై పడిన వేర్వేరు ఘటనల్లో పశ్చిమబెంగాల్‌లోని హౌరా, నార్త్‌ 24 పరగణ జిల్లాల్లో ముగ్గురు చనిపోయారు. జాతీయ విపత్తు స్పందన దళాలు రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాయని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ బుధవారం తెలిపారు. ఒడిశాలో 20 బృందాలు, పశ్చిమబెంగాల్‌లో 19 బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు. రోడ్లపై పడిన భారీ వృక్షాలను తొలగిస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్‌లో 5 లక్షల మందిని, ఒడిశాలో 1.58 లక్షల మందిని సహాయ కేంద్రాలకు చేర్చామన్నారు.

పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ జిల్లాలు, తూర్పు మిద్నాపూర్‌ జిలాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహోపాత్ర తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలు, మౌలిక వసతులకు ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ తుపాను కారణంగా అస్సాం, మేఘాలయాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడినప్పటి నుంచి, తుపాను దిశ, తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలన్నీ 100% కచ్చితత్వంతో వాస్తవమయ్యాయన్నారు.  సహాయ చర్యలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సమర్ధంగా వ్యూహాలు రూపొందించుకోగలిగిందన్నారు.

బంగ్లాదేశ్‌లో...
ఉంపన్‌ బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. పెను గాలులు, భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లో ఇళ్లు కూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరానిలిచిపోయింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో బోటు బోల్తా పడటంతో వాలంటీరు చనిపోయారు. పలు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర హెచ్చరిక స్థాయిని అధికారులు ప్రకటించారు. 20 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించామని, ఆర్మీని రంగంలోకి దింపామని ప్రధాని షేక్‌ హసీనా చెప్పారు.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top