తగ్గుతున్న వెరీయాక్టివ్‌ క్లస్టర్లు

Decreasing Very Active Clusters in AP - Sakshi

నాలుగు రోజుల్లో 56 నుంచి 50కి తగ్గుదల

28 రోజులు దాటినా కేసులు నమోదుకాని క్లస్టర్ల పెరుగుదల  

కేంద్రీకృతంగా పాజిటివ్‌ కేసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే నెలలో పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే వెరీయాక్టివ్‌ క్లస్టర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. తాజా కేసుల నమోదును బట్టి చూస్తే 16వ తేదీ నుంచి వెరీయాక్టివ్‌ క్లస్టర్ల సంఖ్య తగ్గింది. నాలుగు రోజుల కిందట 56 క్లస్టర్లుగా ఉన్న ఈ సంఖ్య.. బుధవారం నాటికి 50కి తగ్గింది. వెరీయాక్టివ్‌ క్లస్టర్లంటే.. ఒకటి నుంచి ఐదు రోజుల్లోగా కేసులు నమోదైనవి. వీటిని రెడ్‌ జోన్‌లో ఉన్న క్లస్టర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న కేసుల్లో ఎక్కువగా కేంద్రీకృతంగా.. అంటే వచ్చిన ప్రాంతాల్లోనే మళ్లీ కేసులు వస్తున్నాయన్నమాట. కేసులు కొత్త ప్రాంతాలకు విస్తరించకపోవడమంటే నియంత్రణ చర్యలు బాగున్నట్టు లెక్క. 28 రోజులు దాటినా కేసులు నమోదు కాని క్లస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరగడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.

కేసుల నమోదు ఇలా
► 6 నుంచి 14 రోజుల్లో నమోదవుతున్న యాక్టివ్‌ క్లస్టర్లు కూడా తగ్గుతున్నాయి.
► శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వంటి జిల్లాల్లో వెరీయాక్టివ్‌ క్లస్టర్లు లేవు.
► కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా వెరీయాక్టివ్‌ క్లస్టర్లున్నాయి.
► కర్నూలు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అర్బన్‌ ప్రాంతాలే కేంద్రీకృతంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 
► 28 రోజులు దాటినా కేసులు నమోదు కాని క్లస్టర్ల సంఖ్య వారం రోజుల్లో 75 నుంచి 101కి పెరిగింది
► 5 కోట్ల జనాభా దాటిన రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో కేసుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. 
► పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం పైగా 40 ఏళ్ల లోపు వారే ఉండటంతో త్వరగా కోలుకుంటున్నారు
► గత పది రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో కోయంబేడుతో సంబంధం ఉన్నవే ఎక్కువ. 

రాష్ట్రంలో రికవరీ శాతం 65.08
రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 65.08 శాతంగా ఉంది. బుధవారం 43 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు మొత్తం కరోనాను జయించిన వారి సంఖ్య 1,664గా ఉంది. ఇంకా యాక్టివ్‌ కేసులు 843 ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 9,159 మందికి పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. వీటిలో కోయంబేడుకు సంబంధించిన కాంటాక్టు కేసులు 10 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 2,560కి చేరగా.. వీరిలో వలస కూలీలు 153 మంది ఉన్నారు.  రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌ రేటు 0.96గా ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top