ఇదీ సీపీఎం రామాయణం

CPM Awareness Programme On Ramayana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరాణిక రామాయణ గ్రంధాన్ని ఆరెస్సెస్‌ లాంటి శక్తులు రాజకీయాల కోసం ఉపయోగించుకోకుండా అందుబాటులో ఉన్న వివిధ రామాయణాల పట్ల రాష్ట్ర ప్రజలకు చైతన్యం కల్పించడం కోసం సీపీఎం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న ‘కేరళ సంస్కత సంస్థ’ జూలై 15వ తేదీ ఆదివారం నుంచి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు వివిధ రామాయణాలపై చర్చా గోష్ఠిలు, సదస్సులు నిర్వహించనుంది. వాల్మీకి, కబీర్, తులసిదాస్‌తోపాటు పలువురు రాసిన రామాయణాలతోపాటు ప్రాంతాల వారిగానున్న రామాయణాలన్నింటిని ఈ కార్యక్రమాల్లో విశ్లేషిస్తారు.

జాతీయ, ప్రాంతీయ రామాయణాలను కలుపుకొని  మలయాళంలో ప్రస్తుతం 29 రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. అందులో కేరళ ప్రాంతానికి చెందిన ఆద్యమ రామాయణం కూడా ఉంది. మలయాళం క్యాలెండర్‌ ప్రకారం జూలై 15వ తేదీన రామాయణం మాసం ప్రారంభమైంది. అదే రోజున రామాయణ కార్యక్రమాన్ని సీపీఎం ప్రారంభించడం పట్ల విమర్శలు వెల్లువెత్తగా, అది యాధశ్చికంగా జరిగిందని, అయినా రామాయణంపైనే తాము అవగాహనా కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు ఆ రోజున ప్రారంభిస్తే మాత్రం తప్పేమిటని పార్టీ సీనియర్‌ నాయకులు అచ్యుతానందన్‌ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు.

ఆరెస్సెస్‌ లాంటి శక్తులు రామాయణాన్ని సంకుచిత స్వభావంతో చూపించడమే కాకుండా అదే స్వభావాన్ని ప్రజలకు రుద్దేందుకు ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారతీయ సంస్కతి రామాయణం లాంటి ఇతిహాసాల్లో ప్రతిబింబిస్తుందా, లేదా? ఇన్ని రామాయణాలు ఏ కారణంగా పుట్టుకొచ్చాయో ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తాము అన్నారు. ఈ కార్యక్రమంలో తాము కూడా పాల్గొంటున్నప్పటికీ ‘కేరళ సంస్కత సంస్థ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని వారు చెప్పారు. సంస్కత సంస్థ ఓ లౌకిక సంస్థ అందులో లౌకికవాదులు, మేథావులు, పండితులు, టీచర్లు, విద్యార్థులు ఉన్నారని వారు తెలిపారు. 

సంస్థ రాష్ట్ర కన్వీనర్‌ టీ. తిలక్‌రాజ్‌ పదవీ విరమణ చేసిన సంస్కత టీచరు. ఆయన సీపీఎం టీచర్స్‌ విభాగానికి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కూడా. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర సీపీఎం కమిటీ సభ్యుడు డాక్టర్‌ వి. శివదాసన్‌ కూడా ఈ సంస్కత సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇది వరకు మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలు విజయవంతం అవడం, వాటికి లక్షలాది మంది ప్రజలు రావడంతో ఇప్పుడు రామాయణంపై కూడా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్‌ శివదాసన్‌ వివరించారు.

రామాయణ, మహాభారతంల పేరిట ప్రజల్లో విద్వేషాలు తీసుకరావడం ద్వారా రాష్ట్రంలో బలపడేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తుంటే తాము అవే రామాయణ, భారతాలు చెబుతున్న బహుళత్వంలో భిన్నత్వాన్ని చెబుతున్న హిందూ ఇజం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీఎం నాయకులు వివరించారు. హిందూత్వ శక్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో సీపీఎం కార్యకర్తలు ‘ఇండియన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ, యోగా స్టడీ సెంటర్‌ పేరిట యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top