
సోమ్‌నాథ్ ఛటర్జీ
దేశ పార్లమెంట్ చరిత్రలో కొందరు ప్రముఖులు పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అత్యున్నతస్థాయిలో గౌరవమర్యాదలు అందుకున్నారు. పార్లమెంట్‌లో వాజ్‌పేయి, పీవీ నరసింహారావు వంటి రాజకీయయోధుల గౌరవాన్ని పొందిన విలక్షణ నేత సోమ్‌నాథ్ ఛటర్జీ. సోమ్‌నాథ్ తండ్రి నిర్మల్ చంద్ర హిందూమహాసభ అధ్యక్షుడిగా పనిచేశారు. సుప్రీంకోర్టు లాయర్‌గా, కలకత్తా హైకోర్టు జడ్జీగా, ఎంపీగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. సోమ్‌నాథ్ మాత్రం కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. 2004లో లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక, ఆ విధులు నిర్వహించిన మొట్టమొదటి కమ్యూనిస్టు నేతగా ప్రత్యేకత సాధించారు.
పార్టీని ఖాతరు చేయలేదు
2008లో అమెరికా – భారత అణు ఒప్పందం నేపథ్యంలో స్పీకర్ పదవికి రాజీనామా చేయాలన్న సీపీఎం అధినాయకత్వం ఆదేశాలను బేఖాతరు చేసి తన సుదీర్ఘరాజకీయ చరిత్రలో పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. స్పీకర్ పదవిలో ఉన్నవారికి పార్టీ ఆదేశాలు వర్తించవనే నిశ్చితాభిప్రాయానికి కట్టుబడ్డారు. అమెరికాతో అణు ఒప్పందంపై కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడమంటే ప్రతిపక్ష బీజేపీ వైఖరిని అవలంబించినట్లేనని భావించారు. ఈ కారణంతో సీపీఎం నుంచి బహిష్కరణకు గురయ్యే వరకు తాను నిర్వహించిన పదవులు, బాధ్యతల పట్ల పూర్తి నిబద్ధతతో వ్యవహరించారు. తనను పార్టీ నుంచి తొలగించిన రోజు తన జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటని అన్నారు.
సీపీఎం అగ్రనేత జ్యోతిబసును ఆయన రాజకీయగురువుగా పరిగణిస్తారు. హీరేన్ ముఖర్జీ, ఇంద్రజిత్ గుప్తా, సోమ్‌నాథ్ లాహిరీ వంటి ఉద్ధండులు నెలకొల్పిన కమ్యూనిస్టు రాజకీయాల సంప్రదాయాన్ని ఆయన కొనసాగించారు. 2007లో రాష్ట్రపతి స్థానానికి పోటీచేసే అవకాశం వచ్చినా.. పార్టీ నేత ప్రకాష్ కారత్ కారణంగా ఆ పదవిని పొందలేకపోయినట్టు బహిరంగంగా చెప్పారు. పదిసార్లు ఎంపీగా ఎన్నికైన ఈయన ఒకేఒక్కసారి (1984) ఓడిపోయారు. అది కూడా మమతా బెనర్జీ చేతిలో. 2009లో తన పదవీకాలం ముగిశాక, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ‘ఓటుకు నోటు’ కుంభకోణంలో తన పాత్ర ద్వారా పరోక్షంగా ప్రభుత్వానికి సహకరించారనేది మాయనిమచ్చ.
రాజ్యాంగం పట్ల నిబద్ధత
1929 జూలై 29న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన ఆయన రాజ్యాంగ విలువలకు, లౌకిక, సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి వ్యవహరించారు. అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటు పవిత్రత ఎక్కువని నమ్మారు. 2004–2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా అధికార, విపక్షాలన్న తేడాల్లేకుండా నిబంధనలను నిక్కచ్చిగా పాటించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదాలు ఏర్పడినపుడు పార్లమెంటే అత్యున్నతమని స్పష్టం చేశారాయన. స్టాండింగ్ కమిటీల నివేదికలకు పార్లమెంటును జవాబుదారీ చేశారు. కమ్యూనిజంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు యత్నించారు.
పార్లమెంటే అత్యుత్తమం
శాసన, న్యాయ వ్యవస్థలకు ఎవరి పరిధులు వారికి స్పష్టంగా ఉన్నాయని.. ఒకరి వ్యవహారాల్లో మరొకరి జోక్యం సరికాదని నమ్మి ఆచరణలో పెట్టారు. జార్ఖండ్ శాసనసభలో బలపరీక్ష వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కల్పించుకుంది. ఓటింగ్ సందర్భంగా సభా వ్యవహారాలను వీడియో తీయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. శాసనసభ స్పీకర్‌కు ఆయన సూచించినట్టు ప్రచారం జరిగింది. చివరకు వీడియో షూటింగ్ లేకుండానే సభా వ్యవహారం సాగింది.