మేము జంతువులమా.. నీళ్లు కూడా ఇవ్వరా?’

COVID Patients Protest On Inhuman Conditions At UP Hospital - Sakshi

ఆహారం సరిగా పెట్టడం లేదంటూ కోవిడ్‌ పేషెంట్ల నిరసన

లక్నో: తమకు సరైన ఆహారం, తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వడంలేదంటూ కరోనా పేషంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని కొత్వా బన్సి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో ఎల్‌1 కేటగిరికి చెందిన ఓ కరోనా పేషెంట్‌ తమ పరిస్థితి జంతువుల కంటే హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘మేము జంతువులమా.. మాకు కనీసం నీళ్లు కూడా ఇవ్వరా’ అంటూ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ‘ఆహారం సరిగా పెట్టడం లేదా’ అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తే.. ‘లేదు కచ్చపచ్చగా ఉడకేసి ఇస్తున్నారు’ అని తెలిపాడు. అంతేకాక ‘మీ దగ్గర డబ్బు లేకపోతే చెప్పండి.. మేం ఇస్తాం. అంతేకాని ఈ పరిస్థితులు ఇలానే కొనసాగతే మేం ఇంటికి వెళ్లి పోతాం. అధికారులతో చెప్పండి’  అంటూ సదరు పేషెంట్‌ ఆందోళనకు దిగాడు. అతడికి ఇతర రోగులు మద్దతు తెలిపారు. (మూడేళ్ల తర్వాత.. కరోనా కలిపింది)

గురువారం ఉదయం ఆస్పత్రిలో రెండు గంటల పాటు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు స్పందించకపోవడంతో పేషెంట్లు ఇలా నిరసనకు దిగారు. దీని గురించి ప్రయాగ్‌రాజ్ చీఫ్ మెడికల్ అధికారిని ప్రశ్నించగా.. ‘విద్యుత్‌ లోపంతో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రీషియన్‌ను పిలిచి రెండు గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించాము. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో నీరు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. కాని రోగులు స్నానానికి మంచినీటిని ఉపయోగిసస్తారు. ఫలితంగా ఈ సమస్య తలెత్తింది. మేము వారి సమస్యను వెంటనే పరిష్కరించాము’ అని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top