కరోనా లక్షణాలతో వెళ్తే.. మందులు రాసి పంపారు!

Coronavirus Suspect Dies After No Ambulance In Madhya Pradesh - Sakshi

ఇండోర్‌: ప్రాణాంతక కరోనా కట్టడిలో మధ్యప్రదేశ్‌ వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి నామమాత్రపు చికిత్స అందించడంతోపాటు.. అవసరానికి అంబులెన్స్‌ ఇవ్వలేకపోయారు. దాంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచారు. వివరాలు.. కోవిడ్‌ కంటైన్‌మెంట్లలో ఒకటైన బద్వాలీ చౌకీ ప్రాంతానికి చెందిన పాండు చందానే (60) కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు మహారహ యశ్వంత్‌రావ్‌ (ఎంవై) ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. మందులు రాసి ఇంటికి పంపించారు. 

మంగళవారం పాండు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ని మరోసారి ఎంవై ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. అయితే, అంబులెన్స్‌ పంపడానికి ఎంవై ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దాంతో గతిలేని పరిస్థితుల్లో బైక్‌పైనే పేషంట్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అంబులెన్స్‌ పంపించి ఉంటే పాండు బతికేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. ఇండోర్‌ నగర మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తొలుత పాండుని ఓ వ్రైవేటు ఆస్పత్రికి తరలించారని.. అక్కడి నుంచి బైక్‌పై ఎంవై ఆస్పత్రికి తీసుకెళ్లగా దురదృష్టవశాత్తూ ఆయన మరణించాడని పేర్కొన్నారు. కాగా, మృతుని కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తామని ఎంవై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పీఎస్ ఠాకూర్‌ చెప్పారు. 
(చదవండి: యమున నది సాక్షిగా కార్మికుల పస్తులు)

ఇక కంద్వా జిల్లాలోని ఖడక్‌పుర ప్రాంతలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అంబులెన్స్‌ అందుబాటులో లేని కారణంగా షైక్‌ హమీద్‌ (65) అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. షుగర్‌, హైబీపీతో బాధపడుతున్న హమీద్‌ను స్కూటర్‌పై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అంబులెన్స్‌ సమకూరిస్తే ప్రాణాలు దక్కేవని చెప్తున్నారు. కాగా, ఖడక్‌పురా కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ ప్రాంతం కావడం గమనార్హం.

ఈ రెండు ఘటనలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు పరస్పర విమర్శలు దిగాయి. తనన కలల నగరం ఇండోర్‌పై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టి పెడితే బాగుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ యాదవ్‌ విమర్శించారు. అంబులెన్స్‌ సౌకర్యం కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. పూర్తి వివరాలు తెలియకుండానే విమర్శలు చేయడం కాంగ్రెస్‌ పార్టీ లక్షణమని బీజేపీ వ్యాఖ్యానించింది. మరణాలు సంభవించడం దురదృష్టకరమని, ఆయా ఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 900 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 53 మంది మృతి చెందారు.
(చదవండి: లాక్‌డౌన్‌ పొడగింపు : ఆ ప్రచారం అవాస్తవం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top