యమున నది సాక్షిగా కార్మికుల పస్తులు

lockdown: Migrant workers face hunger, evictions and unemployment - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని యమునా నదీ తీరాన వందల మంది వలస కార్మికులు తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటిస్తున్నారు. కనీసం తలదాచుకునేందుకు షెల్టర్‌ లేక అల్లాడి పోతున్నారు. దాదాపు 114 మందికి ఆశ్రయం కల్పించిన తాత్కాలిక రేకుల షెడ్డును ఆకలితో అల్లాడిపోతున్న యువకులు ఆక్రోశంతో శనివారం ఆ షెడ్డును కాస్త తగులబెట్టడంతో అందరు రోడ్డున పడ్డారు. అప్పటి వరకు అరకొరగా వారికి అన్న పానీయాలు అందించిన ఢిల్లీ అధికారులు రేకుల షెడ్డును తగులబెట్టిన ఘటనతో వారికి ఆది, సోమ వారాల్లో ఆహారాన్ని అందించలేదట. (అది నకిలీ లింక్.. క్లిక్ చేస్తే అంతే!)

మంగళవారం వారికి స్థానిక గురుద్వారా వారందరికీ ఒక్క పూట భోజనాన్ని ఏర్పాటు చేసిందట. మళ్లీ ఈ రోజు బుధవారం ఉదయం ఢిల్లీ అధికారులు ఒక్క పూట భోజనాన్ని ఏర్పాటు చేశారట. అదీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఆదేశాల మేరకు. జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 24వ తేదీన మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఢిల్లీలోని వలస కార్మికులంతా అప్పటి వరకు తాము దాచుకున్న అతి స్వల్ప సొమ్ముతో ఏప్రిల్‌ మొదటి వారం వరకు నెట్టుకొచ్చారట. అప్పటి నుంచి వారికి తలదాచుకునేందుకు ఇంత నీడతోపాటు ఆకలి దప్పులు తీర్చుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఒకటి, రెండు రోజులు అక్కడిక్కడ అడుక్కొని అర్ధాకలితో బతికిన వారికి శనివారంతో ఏమీ లేకుండా పోయింది. ఢిల్లీ అధికారులు కూడా వారికి ఆహారాన్ని అందించలేక పోయారు. దాంతో ఆక్రోశంతో కొంత మంది యువకులు రేకుల షెడ్డును తగులబెట్టారు. (లాక్డౌన్: ఉండలేం.. ఊరెళ్లిపోతాం!)

ఈ సందర్భంగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీఛార్జీకి పక్కనున్న నదిలో దూకి ఓ యువకుడు మరణించారని వలస కార్మికులు ఆరోపిస్తుండగా, అది నిజం కాదని, నదిలో చనిపోయిన వ్యక్తి వివరాలు కూడా తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి పట్టుమని పది కిలోమీటర్ల దూరంలో కూడాలేని ఆ వలస కార్మికులకు పట్టుమని పిడికెడు అన్నం పెట్టేవారు కూడా లేకుండా పోయారట. యమునా నది మీదుగా వెళుతున్న ఓ మంచినీళ్ల పైపు లీకేజీ నీళ్లను పట్టుకొని వారు గొంతు తడుపుకుంటున్నారు. ఒకటి, రెండు రోజులైతే తాము పస్తులు ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతకుమించి ఉండలేమని వలస కార్మికులు వాపోతున్నారు. (లాక్డౌన్పై నిరసన.. రోడ్లపైకి వేలాది జనం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top