మాజీ సీఎంకు కరోనా పాజిటివ్‌.. 

Coronavirus : Maharashtra Minister Ashok Chavan Tests Positive - Sakshi

ముంబై : మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. అయితే లక్షణాలు లేకుండానే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి అశోక్‌ చవాన్‌ కూడా కరోనా సోకింది. ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ.. కరోనా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం తన స్వస్థలం నాందేడ్‌లో చవాన్‌ చికిత్స పొందుతున్నారు.

ఇంతకుముందు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ ఆస్పత్రిలో రెండు వారాలకు పైగా చికిత్స అనంతరం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. ఇకపై కరోనాపై పోరాటం మరింత కఠినంగా ఉండబోతుందని అన్నారు. కరోనాను ఎదుర్కొవడానికి అవసరమైన అదనపు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకునిగా ఉన్న అశోక్‌ చవాన్‌.. 2008 డిసెంబర్‌ 8 నుంచి 2010 నవంబర్‌ 9 వరకు సీఎంగా కొనసాగారు. ఆదర్శ కుంభకోణం వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు రావడంతో.. అధిష్టానం ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top