సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం

Coronavirus : Kishan Reddy Comments About Lockdown Issue - Sakshi

ఢిల్లీ :  నేపాల్, బంగ్లాదేశ్ , పాకిస్థాన్ సరిహద్దుల గుండా కరోనా పాజిటివ్ లక్షణాలు గల వ్యక్తులు అక్రమంగా ప్రవేశించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సరిహద్దులలో భద్రతను కట్టుదిట్టం చేశామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. మద్యం అమ్మకాలను అనుమతించాలా? వద్దా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమన్నారు. కరోనా హాట్ స్పాట్ లు లేని ప్రాంతాలలో, కేసులు లేని ప్రాంతాలలో ఈ నెల 20 తరువాత కొంత వెసులుబాటు కల్పిస్తామన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాలల మొదట లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తామని, 5 కంటే తక్కువ కేసులు నమోదు అయిన జిల్లాలలో మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా వాటి రవాణాకు మినహాయింపులు ఉంటాయన్నారు. దేశంలో ప్రజలు పూర్తిగా సహకరించినట్లయితే కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పడితే ఈనెల 20 తరువాత లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించే విషయం పై ఆలోచిస్తామన్నారు. కరోనా వైరస్ సమూహాలకు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన భాద్యత దేశ ప్రజల పై ఉందన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారిని ఈ నెల 20తర్వాత స్వస్థలాలకు పంపించే విషయం పై ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా హాట్ స్పాట్ లేని ప్రాంతాలలో దుకాణాలు తెరిచే విధంగా, సామాజిక దూరం పాటించేలా పరిశ్రమలు నడుపుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై పనిచేసే వారికి మినహాయింపు ఇచ్చేలా ఆయా సంబంధిత మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేస్తాయని వెల్లడించారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top