భారత్‌పై కరోనా పడగ

Coronavirus: India Likely to Cross 5 Lakh Cases in 10 Days - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. కేంద్ర వైద్యారోగ్య తాజా గణాంకాల ప్రకారం గత రెండు రోజులలో కోవిడ్‌ కేసుల సంఖ్య 7.6 శాతం పెరిగి 332,424కు చేరుకుంది. అయితే అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే (7.8 శాతం) ఇది కాస్త తక్కువే అయినప్పటికీ కరోనా బాధితుల సంఖ్య వేగంగాపెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. (కరోనా‌: రాజస్తాన్‌ సీఎం కీలక ప్రకటన)

కోవిడ్‌-19 బారిన పడి మరణించిన వారి సంఖ్య గత రెండు రోజులలో 7.2 శాతం పెరిగి 9,520కి చేరుకుంది. ఇది మునుపటి 48 గంటల సమయంలో నమోదైన మరణాలతో (9.7 శాతం) పోలిస్తే చాలా తక్కువ. గత 16 రోజుల్లో దేశంలో కరోనా మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. కోవిడ్‌ కేసులు కూడా 17 రోజుల క్రితం కంటే రెండింతలు పెరిగాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ఇదేవిధంగా కొనసాగితే మరో 5 రోజుల్లో 4 లక్షల మార్క్‌ను దాటుంది. 5 లక్షల మైలురాయిని దాటడానికి 10 రోజుల సమయం పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో అరకొర సౌకర్యాలతో అల్లాడుతున్న ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనుంది. 

ఆరంభంలో డబులింగ్‌ రేటు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం కరోనా కేసులు, మరణాల సంఖ్య అంతకంతకు పెరిగి కోవిడ్‌ ప్రభావిత దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. కరోనా మరణాల్లో భారత్‌ 9వ స్థానంలో కొనసాగుతోంది. మరణాల సంఖ్య 4,000 కన్నా ఎక్కువగా నమోదైన దేశాల్లో గత వారంలో కరోనా కేసులతో  పాటు మరణాల సంఖ్యలో వేగంగా పెరుగుదల నమోదు కావడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసుల్లో ప్రస్తుతం బ్రిటన్‌ కంటే, మరణాల్లో ఇరాన్‌ కంటే ముందు భారత్‌ నిలిచింది. (లాక్‌డౌన్‌ లేనట్టే !)

కోవిడ్ -19 బారిన పడి మహారాష్ట్రలో అత్యధికంగా 3950 మంది మరణించారు. గుజరాత్ (1,477), ఢిల్లీ (1,327), పశ్చిమ బెంగాల్ (475), మధ్యప్రదేశ్ (459) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో సంభవించిన మరణాలలో 81 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. గత ఏడు రోజుల్లో హరియాణా, ఢిల్లీ, తమిళనాడులలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మరణాల సంఖ్య సగటు పరంగా చూస్తే గుజరాత్‌(6.3 శాతం), పశ్చిమ బెంగాల్‌(4.3), మధ్యప్రదేశ్‌(4.2) ముందు వరుసలో ఉన్నాయి. దేశంలో కరోనా మరణాల రేటు 2.9 శాతంగా నమోదయింది. త్రిపుర(0.1 శాతం), లదాఖ్‌, అసోం(0.2 శాతం)లలో అతి తక్కువగా మరణాలు నమోదయ్యాయి. చురుకైన కేసులు తగ్గినప్పటికీ కర్ణాటక, జమ్మూ కశ్మీర్‌లలో మరణాలు గత వారంలో 40 శాతం పైగా పెరగడం గమనార్హం. (కరోనా పరీక్షల ధరలను ప్రకటించిన తెలంగాణ)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top