లాక్‌డౌన్ : కేంబ్రిడ్జ్ పరిశోధకుల షాకింగ్ అధ్యయనం

Corona:India needs 49 day lockdown, not 21 say Cambridge researchers - Sakshi

21 రోజులు కాదు, 49 రోజుల లాక్ డౌన్ కావాలి: కేంబ్రిడ్జ్ పరిశోధకులు

5 రోజుల సడలింపుతో  మూడు లాక్ డౌన్లు అమలు కావాలి

కేసులు తగ్గడమే కాదు,  వైరస్ తిరిగి రాకుండా చూడటం కూడా ముఖ్యం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాన్‌డౌన్ ఆరవ రోజుకు చేరుకుంది. లాక్‌డౌన్‌పై పలు వదంతులు, అంచనాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో 21 రోజుల లాక్డౌన్  గడువును పొడిగించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌పై  షాకింగ్ అధ్యయనం ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  5 రోజుల సడలింపులతో నాలుగు దశల్లో మూడు లాక్ డౌన్లు అవసరమని కేంబ్రిడ్జ్ పరిశోధనలు చెబుతున్నాయి. మూడు వారాల లాక్‌డౌన్ సరిపోదనే  ప్రధానంగా నమ్ముతున్నామని,  సడలింపులతో కూడిన లాక్ డౌన్ వల్ల  వ్యక్తిగత నిర్బంధం, కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ లాంటి నిబంధనలు సమర్ధవంత అమలు సాధ్యమని తద్వారా కేసుల సంఖ్య తగ్గుందని పరిశోధకులు పేర్కొన్నారు.

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  పాటిస్తున్న లాక్ డౌన్ 21 రోజులు కాదు, 49 (21+28) రోజులకు పొడిగిండాలని కేంబ్రిడ్జ్ పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరీటికల్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకులు రాజేష్ సింగ్, ఆర్ అధికారి ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. మార్చి 25న లాక్‌డౌన్ విధింపు, ప్రతి ఒక్కరినీ ఇళ్లకు పరిమితం చేయడం లాంటి పరిణామాల అనంతరం జరిగిన గణిత గణనల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు వారు చెప్పారు. నాలుగు దశల్లో వేర్వేరు నియంత్రణ ప్రోటోకాల్స్‌ను పరిగణనలోకి తీసుకుని మూడు లాక్ డౌన్లు అవసరమని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇందులో మొదటి దశ ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్. ఇది వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తుంది. అయితే మళ్లీ వ్యాప్తి చెందకుండా వుండేందుకు, కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఇది పెద్దగా పని చేయదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఈ దశంలో తిరిగి పుంజుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. 

ఇక రెండవ దశలో 21 రోజుల లాక్ డౌన్ తరువాత  తరువాత 5 రోజుల సడలింపు ఇచ్చి.. వెంటనే 28 రోజుల మరో లాక్ డౌన్ అమలు చేయాలంటున్నారు. తగ్గిన కేసుల ఆధారంగా వైరస్ పునరుజ్జీవనాన్ని అంచనా  వేయలేమన్నారు. అదొక్కటే సరిపోదని పేర్కొన్నారు. మూడవ  దశలో 28 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్లీ 5 రోజుల సడలింపు తరువాత 18 రోజుల లాక్ డౌన్ విధించాలంటున్నారు. ఈ మూడు లాక్‌డౌన్‌లు అయిదు రోజుల  సడలింపులతో అమలు కావాలని సింగ్, అధికారి తెలిపారు. నాలుగవ దశలో పాజిటివ్ కేసుల 10 కంటే తక్కువకు వస్తుంది. స్పష్టమైన కాంటాక్ట్ ట్రేసింగ్,  క్వారంటైన్, తరువాత మాత్రమే వైరస్ తిరిగి రావడాన్ని నిరోధించడం అనే ప్రక్రియ విజయవంతమవుతుందని తేల్చారు. అంతేకాకుండా, 21నుండి 49 రోజుల కాలంలోమరణాల రేటు గణనీయంగా  తగ్గుతుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు.  73 రోజుల వ్యవధిలో  మరణాలు 2,727గా  వుంటాయని,  రెండవ దశలో 11 కి,  మూడవ దశలో ఆరుకి, నాలుగ దశలో నాలుగుకు పడిపోతుందని  భావిస్తున్నట్టు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top