కరోనా: మాస్క్‌ల్లో ఎందుకిన్ని మార్పులు?

Corona Virus: Why These Changes In The Masks - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ గురించి అనవసర భయాందోళనలకు గురికావద్దని,  అలా అని పూర్తి నిర్లక్ష్యం వహించవద్దని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మోచేతులు అడ్డం పెట్టుకోండని, కాస్త ఒకరికొకరు దూరం పాటించండని ఫిబ్రవరి నెలలో పలు దేశాల వైద్య నిపుణులు తమ తమ దేశాల ప్రజలను హెచ్చరించారు. ఆ తర్వాత, మార్చి నెలలో కోవిడ్‌–19 బాధితలు మినహా ప్రజలెవరూ మాస్క్‌లు ధరించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత్‌ సహా పలు దేశాల వైద్య నిపుణులు ప్రజలకు పిలుపునిచ్చారు. (మాస్క్ లేకుంటే అరెస్ట్..)

ఏప్రిల్‌ నెల వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ప్రజలు భయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా, భారత్‌ అధికారులు ప్రజలను ఆదేశించారు. మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ ముంబై మున్సిపాలిటీ అధికారులు ఆదేశాలు జారీ చేయగా, బయటకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాల్సిందేనంటూ కేరళకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఇక ఒడిశా ప్రభుత్వం మాస్క్‌ లేకుండా బయటకు వెళితే రూ.200 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వైద్య సిబ్బంది మాత్రమే మాస్క్‌లు ధరించాలని సూచించిన భారత అధికారులు ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్‌లుగానీ, కాటన్‌తో తయారు చేసిన రెడీమేడ్‌ మాస్క్‌లనుగానీ ధరించాలని సూచిస్తున్నారు. 

ఎందుకీ మార్పు?
భారత ప్రభుత్వం  నాణ్యమైన ‘ఎన్‌–95’ మాస్క్‌లనుగానీ లేదా సర్జికల్‌ మాస్క్‌లనుగానీ ధరించాల్సిందిగా ఎందుకు ఇప్పటి వరకు సూచించలేదు. వైరస్‌ బాధితులకు చికిత్సలు అందిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రమే ఆ మాస్క్‌లను పరిమితం చేయడానికి కారణం వాటి కొరత ఉండడమేనా? తమకు సరైనా గ్లౌసులు, మాస్క్‌లు, కవరాల్‌ సూట్లు లేవంటూ దేశంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. కవరాల్‌ గౌన్లు లేక గౌన్లుగా కుట్టిన ప్లాస్టిక్‌ కవర్లను ధరించడం వల్ల ముంబైలో ముగ్గురు నర్సులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. (మర్కజ్ భయం.. చైన్ తెగేనా!)

ఇప్పుడు భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు కూడా ఇంట్లో కుట్టుకున్న మాస్క్‌లనే వాడుకోవాలని సూచిస్తున్నారు. క్లినిక్‌ మాస్క్‌లకు వీటికి ఉండే తేడాలను పెద్దగా చెప్పడం లేదు. చేతులు మారడం వల్ల క్లినికల్‌ మాస్క్‌లకు వైరస్‌ సోకవచ్చని, ఇంట్లోనే తయారు చేసుకున్న మాస్క్‌లను రోజు శుభ్రంగా ఉతుక్కోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌ల కోసం పల్చటి కాటన్‌ బట్టకన్నా, మందమైన కాటన్‌ బట్టను ఉపయోగించాలని సూచించారు. 

మనం ఎంచుకున్న బట్ట పలుచటిదా లేదా మందమైనదా తెలుసుకోలేక పోయినట్లయితే సదరు గుడ్డలను సూర్యుడి వెళుతురుకు అడ్డంగా పెట్టి చూడాలని, సూర్య కిరణాలను మంచిగా అడ్డుకుంటే మందమైనదని, అడ్డుకోకపోతే పల్చటి గుడ్డని హోంమేడ్‌ మాస్క్స్‌ మీద అధ్యయనం జరిపిన ‘వేక్‌ ఫారెస్ట్‌ బాప్టిస్ట్‌ హెల్త్‌’ అనెస్థీయాలోజీ చైర్మన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ స్కాట్‌ సెహగల్‌ సూచించారు. ఈ చేతి మాస్క్‌లను తయారు చేసుకోవడం తెలియని వారు గుడ్డలను లేదా చిన్న టవల్స్‌ను చేతు రుమాలులాగా ముఖానికి చుట్టుకుంటున్నారు. యువతులయితే ఎప్పటిలాగా స్కార్ఫ్‌లను ముఖానకి చుట్టుకుంటున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top