మహారాష్ట్రపై కరోనా పంజా

Corona Heavily Affected In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై : ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహ్మమారి కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రభావాన్ని తీవ్రంగా చూపుతోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ వేగంగా పెరుగుతున్నాయి. మహమ్మారి కరోనా ధాటికి మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 65కి చేరుకుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు శనివారం మధ్యాహ్నం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 271కి చేరింది. దేశం మొత్త మీద ఇప్పటివరకు ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, ముంబైలలో ఒకొక్కరు చొప్పున నలుగురు కోవిడ్‌ కారణంగా మరణించిన విషయం తెలిసిందే. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా)

కరోనా (కోవిడ్‌–19) విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన ముంబై, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌) పుణే, పింప్రి–చించ్‌వడ్, నాగపూర్‌లలోని అన్ని కార్యాలయాలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని సీఎం తెలిపారు. కాగా.. ఈ నగరాల నుంచే ప్రజలు ఎక్కువగా విదేశాలకు వెళ్లారని, ప్రస్తుతం వారు తిరిగి ఇండియాకు వస్తున్నారని పేర్కొన్నారు. దీంతో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలిన సూచించారు. ‘ప్రస్తుతం మనం సంకటంలో ఉన్నాం. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి సంతోషంగా గడపడానికి కాదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం మాదిరిగా మనల్ని మనం గృహ నిర్భంధం చేసుకోవాలి. ముంబైకర్లు ఇంటివద్దే ఉండి కరోనా వైరస్‌పై యుద్ధం చేయాలి’అని అన్నారు. (271కి చేరిన కరోనా బాధితుల సంఖ్య)

1–8 తరగతుల పరీక్షలు రద్దు 
కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా తరువాతి తరగతులకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ శుక్రవారం ప్రకటించారు. తొమ్మిది, 11వ తరగతి విద్యార్థుల మిగిలిన పరీక్షలను ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి ఉపాధ్యాయులు మినహా మిగతా టీచర్లు ఇంటి నుంచే పని చేయాలని గైక్వాడ్‌ సూచించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top