తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై పార్టీ అధిష్టానం కన్నెర్రజేసింది. సీమాంధ్ర ఎంపీలపై వారు ఫిర్యాదు చేస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై పార్టీ అధిష్టానం కన్నెర్రజేసింది. సీమాంధ్ర ఎంపీలపై వారు ఫిర్యాదు చేస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టింది. సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనలపై ఇటీవల తనకు ఫిర్యాదు చేసిన పలువురు తెలంగాణ ఎంపీలను సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తీవ్రంగా మందలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి కీలక దశలో తెలివితక్కువగా వ్యవహరించి చారిత్రక తప్పిదానికి పాల్పడొద్దంటూ ఆయన గట్టిగా హెచ్చరించారని కూడా సమాచారం.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ విషయంలో తెలంగాణ ఎంపీల తీరును తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ‘‘ఇప్పుడు ఆందోళనలు చేసేందుకు సీమాంధ్ర ఎంపీలకు సర్వ హక్కులూ ఉన్నాయి. ఇంతకాలం మీరు చేశారు, ఇప్పుడు వారిని చేయనివ్వండి. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది. దాన్ని మీకందరికీ స్వయంగా మేడమే స్పష్టంగా తెలియజేశారు కూడా. మరి అలాంటప్పుడు సీమాంధ్ర ఎంపీల మనోవేదన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. వారికి వ్యతిరేకంగా మతిలేని ఆందోళనకు దిగడం ద్వారా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చకండి’’ అంటూ గట్టిగానే అక్షింతలు వేసినట్టు చెబుతున్నారు.
నిజానికి తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ విస్పష్టంగా ప్రకటన చేశాక కూడా తెలంగాణ నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం చాలా అసంతృప్తితో ఉందని సమాచారం. సీమాంధ్ర నేతల అభ్యంతరాలు, ఆందోళనలు, సమస్యలను ఆలకించేందుకు పార్టీపరమైన కమిటీ వేస్తే దానికి తెలంగాణ నేతలు అభ్యంతరపెట్టాల్సిన అవసరం ఏముందంటూ మండిపడుతోందని ఏఐసీసీ వర్గాలన్నాయి. ‘‘ముఖ్యంగా ఈ అంశంపై తెలంగాణ ఎంపీలను అహ్మద్ పటేల్ గట్టిగా మందలించారు. ఇటీవల తిరుపతిలో సీమాంధ్ర వాసులను ఎంపీ వి.హన్మంతరావు అనవసరంగా రెచ్చగొట్టారంటూ సోనియా కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. అనవసర చేష్టలతో సీమాంధ్ర ఎంపీలకు తెలంగాణ ఎంపీలు అడ్డు తగలరాదన్నదే అధిష్టానం అభిమతం. అది తెలివితక్కువతనమే కాగలదని పార్టీ పెద్దలంతా భావిస్తున్నారు’’ అని వివరించాయి.