‘రాఫెల్‌’పై కాగ్‌ విచారణ

Comptroller and Auditor General is looking into alleged irregularities - Sakshi

పార్లమెంట్‌ సమాచారం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో భారత్‌ కుదుర్చుకున్న రూ.58,000 కోట్ల విలువైన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్‌ భమ్రే లోక్‌సభకు తెలిపారు. 2019, సెప్టెంబర్‌ నుంచి భారత్‌కు ఈ యుద్ధ విమానాల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు. రక్షణ రంగానికి సంబంధించి 2015 నుంచి ఇప్పటివరకూ సీబీఐ 4 కేసుల్ని నమోదు చేసిందన్నారు. రైల్వేశాఖపై నయాపైసా భారం లేకుండా దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్‌ గొహైన్‌ పార్లమెంటుకు రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 707 రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.
 
ది ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సవరణ) బిల్లు–2018ను పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రద్దీ ఉండే విమానాశ్రయాలనే మేజర్‌ ఎయిర్‌పోర్టులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి 15 లక్షలుగా ఉంది. అలాగే వేర్వేరు విమానాశ్రయాలు, ఎయిర్‌డ్రోమ్‌లకు మార్కెట్‌ ధరల ఆధారంగా వేర్వేరు టారీఫ్‌లు ఉండేలా ఈ చట్టంలో సవరణలు చేశారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మిగిలిన పట్టణాలతో అనుసంధానించేందుకు మరో వెర్షన్‌ ‘ఉడాన్‌’ పథకాన్ని తీసుకురానున్నట్లు పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు.

ఏ సందర్భంలో దేశ ద్రోహ చట్టాన్ని ప్రయోగించవచ్చన్న విషయమై సలహాలు అందించేందుకు జాతీయ న్యాయ కమిషన్‌ భారతీయ శిక్షా స్మృతిలోని ఆర్టికల్‌ 124(ఏ)ను పరిశీలిస్తున్నట్లు కేంద్రం  తెలిపింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వర్షపాతంపై మరింత కచ్చితత్వంతో అంచనాలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సింగ్‌ లోక్‌సభకు తెలిపారు. పనితీరును మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఐఎండీ దేశీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.వివాదాస్పద ఎఫ్‌ఆర్‌డీఐ (ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌) బిల్లు–2017ను కేంద్రం పార్లమెంటు నుంచి వెనక్కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులోని ‘బెయిల్‌ ఇన్‌’ నిబంధనపై విమర్శలు రావడంతో బిల్లును వెనక్కు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top