భవిత తేలేది నేడే | Sakshi
Sakshi News home page

భవిత తేలేది నేడే

Published Thu, May 19 2016 1:18 AM

భవిత తేలేది నేడే - Sakshi

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
 
♦ మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం
♦ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
 
 న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల పాలక పక్షాల భవితవ్యం మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తరువాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. తదుపరి గంట వ్యవధిలోనే ఫలితాల సరళి ఏవిధంగా ఉన్నదీ తెలిసే వీలుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

మొత్తమ్మీద మధ్యాహ్నం మూడు గంటలకల్లా లెక్కింపు ప్రక్రియ దాదాపుగా పూర్తవుతుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా 8,300 మంది అభ్యర్థుల జాతకాలు తేలనున్నాయి. వీరిలో అస్సాం సీఎం తరుణ్ గొగోయ్, బీజేపీకి చెందిన సీఎం పదవి పోటీదారులైన సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వాస్, తమిళనాడు సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, కేరళ సీఎం ఊమెన్ చాందీ, కేరళకు చెందిన సీపీఎం నేతలు వీఎస్ అచ్యుతానందన్, పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీపీఎం నేత సూర్యకాంత మిశ్రా, పుదుచ్చేరి సీఎం ఎం.రంగస్వామి ఉన్నారు.

 ఎగ్జిట్‌పోల్స్ నిజమవుతాయా?: అసెంబ్లీ ఎన్నికలపై వివిధ టీవీ చానళ్లు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించాయి. అయితే ఎంతవరకు ఇవి నిజమవుతాయనేది కొద్దిగంటల్లో స్పష్టమవనుంది. అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్పు తథ్యమని ఎగ్జిట్‌పోల్స్ చాటాయి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఘంటాపథంగా చెప్పాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని, అదేవిధంగా కేరళలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషించాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు భంగపాటు తప్పదని, డీఎంకే అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి.

బెంగాల్‌లో మాత్రం సీఎం మమత తిరిగి అధికారంలోకి వస్తారని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. వామపక్షాలు, కాంగ్రెస్ కలసి పోటీపడినా ఉపయోగం ఉండదన్నాయి. ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌కు ఈసారీ నిరాశే ఎదురవుతుందని విశ్లేషించాయి. ఆ పార్టీకి దక్కే ఏకైక ఉపశమనం పుదుచ్చేరిలో విజయం ఒక్కటేనని పేర్కొనడం తెలిసిందే.

Advertisement
Advertisement