
రాహుల్ బ్రిటన్ పౌరుడిగా చెప్పుకున్నారా?
తన జాతీయత గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు పంపించినట్లు పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సభ్యుడు అర్జున్ రామ్ మెగ్వాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: తన జాతీయత గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు పంపించినట్లు పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సభ్యుడు అర్జున్ రామ్ మెగ్వాల్ తెలిపారు. బ్రిటన్లోని ఓ కంపెనీకి సంబంధించిన పత్రాల్లో రాహుల్ తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని, అలా ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో డిమాండ్ చేశారు.
'బ్రిటన్ సిటిజన్ గా తనను తాను ఎందుకు రాహుల్ గాంధీ పేర్కొన్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చాం' అని అర్జున్ అన్నారు. 2003లో ఓ కంపెనీకి సంబంధించిన పత్రాల్లో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటన్ పౌరుడుగా ప్రకటించుకున్నారని గతంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాహుల్ తన పుట్టిన రోజును సరిగానే ప్రకటించారు కానీ, బ్రిటన్ జాతీయుడిగా పేర్కొన్నారని అందులో వివరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.