చైనా చేతిలో మన అత్యాధునిక టెక్నాలజీ..!

China accessed drone tech from downed Indian UAV? - Sakshi

న్యూఢిల్లీ : సమవుజ్జీలు అయిన రెండు దేశాల మధ్య పైచేయి కోసం జరిగే పోరాటం, పడే ఆరాటం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారత రక్షణ దళం చేసిన చిన్న పొరబాటు దేశ రక్షణకు తీవ్ర ముప్పు వాటిల్లే పరిస్థితిని తెచ్చింది. కొద్ది రోజుల క్రితం భారత్‌కు చెందిన మానవ రహిత డ్రోన్‌ డోక్లాం పీఠభూమి సరిహద్దులో ఎగురుతూ చైనా భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

డ్రోన్‌ భూభాగంలోకి ప్రవేశించిన రెండు వారాల తర్వాత చైనా దానిపై ప్రకటన విడుదల చేసింది. డ్రోన్‌ను నేలకూల్చినట్లు పేర్కొంది. అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించినందుకు భారత్‌ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేసింది. 

మన టెక్నాలజీ చైనా చేతిలో..
తాజా సమాచారం ప్రకారం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న డ్రోన్‌ హెరాన్‌ నుంచి టెక్నాలజీని చైనా చోరి చేసిందనే రిపోర్టులు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో తయారైన హెరాన్‌ డ్రోన్‌ను భారత్‌ ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసింది. దీన్ని ఇజ్రాయెలీ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ) తయారు చేసింది. ఏ వాతావరణ పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్ధ్యం హెరాన్‌ సొంతం. హెరాన్‌ బరువులో 250 కిలోలు దాని సెన్సార్లే ఉంటాయి. 

ఆపరేట్‌ చేసే బేస్‌ నుంచి తప్పిపోయిన తిరిగి బేస్‌ను చేరుకునేలా దీన్ని ఐఏఐ రూపొందించింది. దీంతో డ్రోన్‌ చైనాలోకి తప్పిపోగానే.. అదే తిరిగి బేస్‌కు వచ్చేస్తుందని భారత రక్షణ వర్గాలు భావించాయి. అయితే అలా జరగలేదు. దీంతో ఎంతో విలువైన టెక్నాలజీని చైనా తస్కరించి ఉండొచ్చని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. డ్రోన్‌ ఉదంతంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ప్రముఖ భద్రతా సంస్థ ఆసక్తికర కామెంట్లు చేసింది.

ఓ చక్కని గూఢచారిని కోల్పోవడం భారత్‌కు దెబ్బ అయితే.. అత్యాధునిక సాంకేతికతను చేజిక్కించుకున్న చైనా బలగాలకు విలువ సమాచారం దొరికినట్లే అని పేర్కొంది. కార్గిల్‌ యుద్ధం తర్వాత వేసిన కార్గిల్‌ రివ్యూ కమిటీ సూచనతో భారత్‌ హెరాన్‌ మానవ రహిత డ్రోన్లను ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసింది. 2000లో భారత ఆ‍ర్మీ, నేవీ, వాయుసేనలు ఈ డ్రోన్లను వినియోగించటం ప్రారంభించాయి. ప్రస్తుతం భారత ఆర్మీ వద్ద ఇలాంటి డ్రోన్లు 45 ఉన్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top