సరిలేరు నీకెవ్వరు..!

Chennai Engineer Found Vikram Lander Address - Sakshi

షణ్ముగం ది గ్రేట్‌

విక్రం ల్యాండర్‌ అచూకీ కనుగొన్న చెన్నై ఇంజినీరు

ఇస్రో, నాసా శాస్త్రవేత్తల ప్రశంసలు

ఎనిమిది నెలల క్రితం ఉపగ్రహం కనిపించకుండా పోయింది. దాని ఆచూకీ కోసం ప్రపంచంలోనిపలువురు అంతరిక్షశాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైనారు. అయితే తమిళనాడుకుచెందిన ఒక యువ ఇంజినీరు అనేక పరిశోధనలు చేసి ఆ ఉపగ్రహం అచూకీని కనిపెట్టేశారు. అందరిచేతా అభినందనలుఅందుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) శాస్త్రవేత్తలు 2008లో చంద్రయాన్‌–1 అంతరిక్ష నౌకను అంతరీక్షంలోకి ప్రవేశపెట్టారు. ఆ అంతరీక్ష నౌక చంద్రుడి చుట్టూ తిరిగి అక్కడ నీరున్నట్లు నిర్ధారించింది. ఈ విజయోత్సాహంతో చంద్రుడిలోని హీలియం వాయువుపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్‌–2ను ప్రయోగించారు. ఈ వాహన నౌకలో ఆర్బిట్టర్, విక్రం ల్యాండర్‌ అనే రెండు రెండు ఉపగ్రహాలను అమర్చారు. చంద్రుని చుట్టు తిరుగుతూ పరిశోధనలు చేసేలా ఆర్బిట్టర్, చంద్ర మండలంపై దిగి పరిశోధనలు చేసేలా విక్రం ల్యాండర్‌ను రూపొందించారు. దురదృష్టవశాత్తు విక్రంల్యాండర్‌ చంద్రమండలంపై దిగేందుకు మరో 2 కి.మీ దూరంలో ఉండగా వేగంగా పయనిస్తూ తన దిశను మార్చుకుని చంద్రునిపై కూలిపోయింది. ఈ పరిణామంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా ల్యాండర్‌ జాడ కానరాలేదు. ల్యాండర్‌ ఆచూకీ కోసం ఆమెరికాలోని నాసా సంస్థ వందలాది ఫొటోలను తీసినా అంతుచిక్కలేదు. నాసా తీసిన ఫొటోలను ఇంటర్నెట్‌ ద్వారా బహిరంగపరిచారు.

ఈ ఫొటోల ఆధారంగా శాస్త్రవేత్తలు ఎవరైనా ల్యాండర్‌ను గుర్తించవచ్చని ప్రకటించారు. ఈ దశలో మధురైకి చెందిన షణ్ముగ సుబ్రమణ్యం అనే యువ ఇంజినీరు ల్యాండర్‌ను కనుగొనడాన్ని సవాలుగా స్వీకరించారు. కంప్యూటర్‌ ఇంజినీరైన అతను చెన్నై అడయారులో ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. విధులు  ముగిసిన తరువాత ల్యాండర్‌ను కనుగొనేందుకు సమయం వెచ్చించేవాడు. సెప్టెంబర్‌ 17, అక్టోబర్‌ 14, 15, నవంబర్‌ 1వ తేదీన నాసా విడుదల చేసిన ఫొటోలపై పరిశోధనలు చేసి విక్రం ల్యాండర్‌ కూలిపోయి 24 చోట్ల చెల్లాచెదరుగా పడి ఉండడాన్ని విజయవంతంగా గుర్తించాడు. ల్యాండర్‌ను గుర్తించినట్లు ఈమెయిల్‌ ద్వారా నాసాకు సమాచారం ఇచ్చాడు. నాసా శాస్త్రవేత్తలు సైతం సుబ్రమణ్యం పంపిన సమాచారాన్ని విశ్లేషించి నిర్ధారించుకున్నారు. ఎనిమిది నెలల తరువాత ల్యాండర్‌ను గుర్తించడం చంద్రయాన్‌–3 ప్రయోగానికి తోడ్పడుతుందని పేర్కొంటూ ఇస్రో శాస్త్రవేత్తలు, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్, అమ్మముక ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తదితరులు షణ్ముగ సుబ్రమణ్యంను అభినందనలతో ముంచెత్తారు. నాసా విడుదల చేసిన ఫొటోలను పరిశీలించినపుడు అందులో చుక్కలు తప్ప మరేవీ లేవు. ఆ చుక్కలే ల్యాండర్‌ శిథిలాలుగా ఉండొచ్చని పరిశోధనలు చేశాను. చివరకు అదే నిజమైందని షణ్ముగ సుబ్రమణ్యం మీడియాకు తెలిపాడు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top