75 కొత్త సర్కారు మెడికల్‌ కాలేజీలు

Central Cabinet Approval for 75 new government medical colleges - Sakshi

తద్వారా అదనంగా 15వేలకు పైగా ఎంబీబీఎస్‌ సీట్లు

రూ.24,375కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

చక్కెర రైతుల బకాయిలు తీర్చేలా భారీ సబ్సిడీ

అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కూటమి ఏర్పాటుకూ పచ్చజెండా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. తద్వారా ప్రస్తుతమున్న ఎంబీబీఎస్‌ సీట్లకు మరో 15,700 సీట్లు పెరుగుతాయి. 2021–22 విద్యా సంవత్సరం నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ (సీసీఈఏ) మెడికల్‌ కాలేజీల పెంపుతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ఏర్పాటుచేయనున్న 75 మెడికల్‌ కాలేజీలను జిల్లా ఆసుపత్రులతోపాటు 200/300 పడకలున్న ఆసుపత్రులకు అటాచ్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. వచ్చే మార్కెటింగ్‌ సంవత్సరంలో 60లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు సంబంధించిన రూ.6,268 కోట్ల సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపింది.

ఆ జిల్లాలకే ఎక్కువ ప్రాధాన్యం
కొత్తగా కేటాయించే 75 మెడికల్‌ కాలేజీల్లో ఎక్కువ మొత్తం యాస్పిరేషనల్‌ (సామాజిక–ఆర్థికాభివృద్ధికి దూరంగా ఉన్న) జిల్లాలకే కేటాయించే అవకాశాలున్నాయి. ఆయా జిల్లాల్లో వైద్యసదుపాయాల కల్పనను మెరుగుపరచడంతోపాటు వైద్యుల కొరతను అధిగమించడంపైనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ‘జిల్లా, రిఫరల్‌ ఆసుపత్రులను ఆధునీకరించడం కోసం కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటుచేయాలన్న’కేంద్ర ప్రభుత్వ పథకం మూడో దశలో భాగంగానే ఈ 75 కాలేజీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూ.24,375కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎమ్‌సీ) బిల్లుకు పార్లమెంటు చేసిన సవరణలపై కేబినెట్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ బిల్లుకు జూలై 17న కేబినెట్‌ అంగీకారం తెలపగా.. జూలై 29న లోక్‌సభ, ఆగస్టు 1న రాజ్యసభ ఆమోదం తెలిపిన సంగతి విదితమే.

చక్కెరకు తీపి కబురు
చెరకు రైతులకు మిల్లుల వద్ద భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చేందుకు కేంద్రం మరోదఫా ఉపశమన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు దఫాల్లో చక్కెర మిల్లులపై వరాలు కురిపించిన సర్కారు.. వచ్చే మార్కెటింగ్‌ సంవత్సరం (ఈ అక్టోబర్‌లో ప్రారంభం)లో 60లక్షల టన్నులు చక్కెరను ఎగుమతి చేసేందుకు సంబంధించిన రూ.6,286కోట్ల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. తద్వారా.. దేశవ్యాప్తంగా చక్కెర మిల్లుల్లో ఉన్న మిగులు ఉత్పత్తిని వదిలించుకోవడంతోపాటు.. రైతుల బకాయిలు చెల్లించేందుకు ఈ చర్య ఉపయోగపడనుందని సమాచార ప్రసార మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కర్ణాటకల్లోని లక్షలమంది చెరకు రైతులకు ఈ నిర్ణయం ద్వారా మేలు చేకూరనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జాతీయ చక్కెర ఫ్యాక్టరీల సహకార సంఘం హర్షం వ్యక్తం చేసింది. సరైన సమయంలో తీసుకున్న గొప్ప నిర్ణయంగా అభివర్ణించింది. 

 విపత్తు నిర్వహణకు ‘సై’
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ మౌలికసదుపాయాల కూటమి (సీఆర్‌డీఐ) ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్‌ 23న న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో సీఆర్‌డీఐ ఏర్పాటును ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించనున్నారు. సీఆర్‌డీఐ కోసం రూ.480కోట్ల నిధిని ఏర్పాటుచేసేందుకు కూడా కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top