'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం' | Sakshi
Sakshi News home page

'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'

Published Mon, Apr 6 2015 4:56 PM

'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'

ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును తాము స్వీకరించలేమని  సీబీఐ.. కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దర్యాప్తు విషయంలో సిద్ధరామయ్య సర్కారు ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమని తెలిసింది.

రవి ఎందుకు మరణించారు, ఎలా మరణించారు అనే విషయాల్ని ఫలానా కోణంలో మాత్రమే దర్యాప్తు చేయడంతోపాటు మూడు నెలలలోగా చార్జిషీటు సిద్ధం చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించిన దరిమిలా ఇలాంటి కండిషన్ల మధ్య కేసును స్వీకరించలేమని సీబీఐ వర్గాలు తెలిపాయి.

 

కాగా, కర్ణాటక సీఐడీ పోలీసులు పర్యవేక్షిస్తోన్న ఈ కేసు దర్యాప్తును స్వీకరించాలని సీబీఐకి మరోసారి నోటిఫికేషన్ పంపుతామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కొత్త నోటిషికేషన్ అందిన తర్వాత, దానిని పరిశీలించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని దర్యాప్తు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మార్చి 17న తన అధికార నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి రవి.. కోలార్ జిల్లాలోని ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఆయన బెదిరింపులతోపాటు రాజకీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే ఆయన మరణానికి ప్రధాన కారణమని కుటుంబ సభ్యులతోపాటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మరో ఐఏఎస్ అధికారిణితో ప్రేమ వ్యవహారమే రవి మృతికి కారణమని పేర్కొనడం గమనార్హం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement