
ఆకలితో అలమటిస్తున్నారా?
దేశంలోని వాహనదారులు ఆకలితో అలమటించడం లేదనీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను భరించగలరని కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కణ్నాంథనమ్ వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు.
పెట్రోల్ ధరలపై వాహనదారులనుద్దేశించి మంత్రి ఆల్ఫోన్స్ వ్యాఖ్య
తిరువనంతపురం: దేశంలోని వాహనదారులు ఆకలితో అలమటించడం లేదనీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను భరించగలరని కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కణ్నాంథనమ్ వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సగానికి తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరిగిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరమనీ, వాటి సమీకరణ కోసమే పెట్రో ఉత్పత్తులపై పన్నులు వేస్తున్నామని ఆల్ఫోన్స్ సమర్థించుకున్నారు.
‘ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచింది. ఆ డబ్బంతా పేదలకు వెళ్తుంది’ అని ఆల్ఫోన్స్ అన్నారు. ఇటీవలి పునర్వ్యవస్థీకరణలో మోదీ మంత్రివర్గంలో పర్యాటక, ఐటీ మంత్రిగా చేరిన ఆల్ఫోన్స్... మంత్రి అయ్యాక తొలిసారి కేరళలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘భరించగలిగే వారిపై మాత్రమే మేం పన్నులు వేస్తున్నాం. కారు, బైక్ ఉండి డీజిల్, పెట్రోల్ కొనేవారు కచ్చితంగా ఆకలితో అల్లాడేవారు కాదు. వాళ్లు పన్ను కట్టాలి’ అని అన్నారు. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు మరికొన్ని ఇతర అవసరాలకోసం ఆ డబ్బును ఉపయోగిస్తామన్నారు.